నేటి నుంచి షిరిడీ బంద్... కానీ...

నేటి నుంచి షిరిడీ బంద్... కానీ...

షిరిడీ ఆలయం వివాదంలో చిక్కుకుంది. సాయిబాబా జన్మస్థలంగా చెబుతున్న పత్రి అభివృద్ధి సాధిస్తే... షిర్డీకి ప్రాభవం తగ్గిపోతుందన్నది కొందరి వాదన. ఈ క్రమంలో 25 గ్రామాల ప్రజలతో పాటు బాబా భక్తులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  షిరిడీతో పాటూ చుట్టూ గల 25 గ్రామాల్లో మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని నిర్ణయించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం ఉద్ధవ్‌ థాక్రే దిగి వచ్చే వరకు నిరవధిక బంద్‌ పాటించాలన్నది షిరిషీ చుట్టూ గల గ్రామాలు నిర్ణయించాయి. మరోవైపు... 25 గ్రామాల బంద్‌లో భాగంగా సాయి బాబా ఆలయాన్ని కూడా నిరవధికంగా మూసివేస్తారన్న వార్తల్ని సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఖండించింది. బాబా ఆలయం తెరిచే ఉంటుందని... యథావిధిగా పూజా కార్యక్రమాలు జరుగుతాయని  చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ దీపక్‌ మధుకర్‌ ముగిలికర్‌ స్పష్టం చేశారు. 

బంద్‌కు పిలుపునిచ్చిన 25 గ్రామాల ప్రతినిధులు కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. షిరిడీ సాయి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు వాళ్లు. బాబా ఆలయంలో పూజ అనంతరం షిరిడీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని చెబుతున్నారు. సాయి బాబా జన్మస్థలంగా చెబుతున్న పత్రి పట్టణ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయించారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే. ఇదే కొత్త వివాదానికి తెర లేపింది. పత్రి అభివృద్ధి చెందితే... షిర్డి ప్రాశస్థ్యం తగ్గిపోతుందనే చుట్టూ గల 25 గ్రామాలు ఆందోళనకు దిగుతున్నాయన్నది కొందరి వాదన. ఇంకోవైపు... సాయినాథుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దని భక్తులు కోరుతున్నారు. షిరిడీ అంటేనే సాయినాథుడు కొలువైన ప్రదేశమని.. అదే తమనమ్మకని తేల్చి చెబుతున్నారు. ఇక్కడే బాబా సమాధి సైతం ఉందని.. ఆలయం వివాదానికి ముగింపు పలకాలని సూచిస్తున్నారు. మరికొందరు భక్తులు.. షిరిడీలానే పత్రిలోనూ ఆలయం నిర్మిస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. రెండుచోట్ల సాయినాథుడిని భక్తులు దర్శించుకుంటారంటున్నారు. మొత్తానికి 25 గ్రామాల నిరవధిక నిరసనలతో షిరిడీకి వెళ్లే బాబా భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ పరిస్థితుల్లో వివాదానికి ప్రభుత్వం ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి మరి.