నిరుద్యోగుల శాపం సాధ్వీ కంటే శక్తివంతం: శివసేన

నిరుద్యోగుల శాపం సాధ్వీ కంటే శక్తివంతం: శివసేన

ఆర్థికంగా చితికిపోయిన జెట్ ఎయిర్వేస్ ను జాతీయం చేసి ఉద్యోగుల ఉద్యోగాలను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. పార్టీ తన సొంత పత్రిక సామ్నా సంపాదకీయంలో 'నిరుద్యోగుల శాపం సాధ్వీ శాపం కంటే ఎక్కువ శక్తివంతమైనదని' పేర్కొంది. ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరేకు తను శాపం తగిలిందని సాధ్వీ ప్రజ్ఞా అనడంపై సేన ఈ విధంగా వ్యాఖ్యానించింది.

ఇన్సూరెన్స్, ఎయిర్ లైన్ కంపెనీలను జాతీయం చేసి మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల దూరదర్శితను చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేర్చుకోవాలని శివసేన సూచించింది. ప్రభుత్వం ఎయిరిండియాకు రూ.29,000 కోట్ల సాయం చేస్తోందని శివసేన చెప్పింది. జెట్ ఎయిర్వేస్ కేసులో బాంబే హైకోర్ట్ జోక్యం చేసుకోబోనని చెప్పడంపై సేన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏ కంపెనీని రక్షించేందుకు ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కి తానెలాంటి ఆదేశాలు ఇవ్వబోనని హైకోర్ట్ గత గురువారం స్పష్టం చేసింది.

రూ.400 కోట్ల ఎమర్జెన్సీ ఫండింగ్ లభించని కారణంగా జెడ్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి నిరవధికంగా కార్యకలాపాలు నిలిపేసింది. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు సహా ఎయిర్ లైన్స్ కి చెందిన మొత్తం 23,000 మంది ఉద్యోగుల ఉపాధి సంకటంలో పడింది. జెట్ ఉద్యోగుల అంశాన్ని తాము ప్రభుత్వం ఎదుట ఉంచినట్టు శివసేన తెలిపింది. శివసేన మహారాష్ట్ర, కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉంది.