శివసేనకు ఊహించని షాక్ ఇచ్చిన గవర్నర్‌

శివసేనకు ఊహించని షాక్ ఇచ్చిన గవర్నర్‌


మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.  శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండగా... ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు గవర్నర్‌. మూడో అతిపెద్ద పార్టీగా NCPని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. శివసేన నేతలు గవర్నర్‌ను కలిసిన కాసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదిత్య థాక్రే నేతృత్వంలోని బృంధం గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు రోజుల గడువు కావాలని కోరింది. శివసేన అభ్యర్థనను తిరస్కరించిన గవర్నర్‌... ఎన్‌సీపీని ఆహ్వానించారు. బీజేపీ చేతులెత్తేయడంతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. ఎన్‌సీపీ పెట్టిన కండీషన్‌లకు ఒప్పుకొని.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది.

ఇటు కాంగ్రెస్‌ చీఫ్ సోనియాతో ఉద్ధవ్ థాక్రే ఫోన్‌లో చర్చించారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అంతా భావించారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం శివసేనకు మద్ధతుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకోసమే గవర్నర్‌ను గడువు కోరగా ఆయన ఇవ్వలేదు. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న శివసేన ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇక ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఈ రెండు పార్టీల మద్ధతు అనివార్యం. శివసేన, కాంగ్రెస్‌ కలిస్తేనే ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐతే ఎన్‌సీపీ, కాంగ్రెస్ ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్నాయి. ఫలితాల తర్వాత కూడా వాటి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు శివసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.