చంద్రబాబుపై శివసేన సెటైర్లు..

చంద్రబాబుపై శివసేన సెటైర్లు..

బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తూ యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై శివసేన పార్టీ సెటైర్లు వేసింది. తన అధికార పత్రిక 'సామ్నా'లో ప్రచురించిన సంపాదకీయంలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది శివసేన. రుతుపవనాలు అండమాన్ ను తాకి అందరికీ ఆనందం కలిగిస్తున్నాయి.. అలాగే, చంద్రబాబు.. ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు వినోదాలు పంచుతున్నాయని ఎద్దేవా చేసింది. నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని అవుతారని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.. కానీ, చంద్రబాబు డూప్లికేట్ తాళం చెవితో అధికారం తలుపు తెరవాలని అనుకుంటున్నారని.. చంద్రబాబే స్వయంగా ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోబోతున్నారని రాసుకొచ్చింది. 

ఇక శ్మశానంలో బూడిదనంతా పోగు చేసినట్టుగా చంద్రబాబు ప్రయత్నాలు ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది శివసేన పార్టీ... నిజంగా విపక్షాల ఏకత అనేది ఫలితాల తర్వాత తేలుతోందని పేర్కొంది. ఐదు మంది విపక్షాలు... ఐదు మంది తామే ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించిన 'సామ్నా' సంపాదకీయం... బీజేపీ 300 సీట్లకు పైగా గెలుస్తుందని అమిత్ షా  ముందుగానే ప్రకటించారని.. అయినా, చంద్రబాబు వ్యర్థ  ప్రయత్నాలు చేయడం మానలేదని ఎద్దేవా చేసింది శివసేన. కాగా, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్న చంద్రబాబు.. ఇవాళ కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు... ఎన్డీయేతర పక్షాల నేతలను కలిసే అవకాశం ఉంది.