సమాజ్ వాదీ పార్టీ కోట్లకు టికెట్లు అమ్ముతోంది:శివపాల్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీ కోట్లకు టికెట్లు అమ్ముతోంది:శివపాల్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో గుర్తింపు లభించడం లేదని అలిగి ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ (లోహియా) (పీఎస్పీఎల్) పేరుతో వేరు కుంపటి పెట్టుకున్న శివపాల్ యాదవ్ ఎస్పీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్పీ సోషలిస్ట్ సిద్ధాంతాలతో రాజీ పడి లోక్ సభ ఎన్నికల్లో రూ.10-25 కోట్లకు టికెట్లు అమ్ముతోందని శివపాల్ సింగ్ యాదవ్ ఆరోపించారు.

ఎస్పీలో ఇప్పుడు సోషలిస్ట్ సిద్ధాంతాలను అమ్మేస్తున్నారని శివపాల్ యాదవ్ లక్నోలో ఇవాళ విమర్శించారు. బయటి నుంచి వచ్చిన నేతలకు రూ.10, రూ.15, రూ.20, రూ.25 కోట్లు తీసుకొని టికెట్లు ఇస్తున్నారని అన్నారు. సోషలిస్ట్ మార్గంలో నడిచే కార్యకర్త ఎలా ఇంత భారీ డబ్బు కూడగట్టి టికెట్ పొందగలడని ప్రశ్నించారు. సోషలిజమ్ గురించి ఏమీ తెలియని వారికి ఎస్పీ టికెట్లు ఇస్తోందని శివపాల్ సింగ్ యాదవ్ ఎద్దేవా చేశారు.

అఖిలేష్ యాదవ్, సోదరుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వాల్లో కేబినెట్ మంత్రిగా ఉన్న శివపాల్ యాదవ్ విమర్శల పదును పెంచుతూ సోషలిజం సిద్ధాంతాలను నడిబజారులో అమ్మకానికి పెట్టారని దుయ్యబట్టారు. ఎస్పీ కార్యకర్త ఇప్పుడు డబ్బు కట్టలే మాట్లాడుతుండటంతో ఎన్నికల్లో పోటీ చేయడం గురించే ఆలోచించలేక పోతున్నారని అన్నారు. ఆ కార్యకర్తలు ఇక ఎన్నికల్లో పోటీ చేయలేరు, ప్రజా ప్రతినిధులు కాలేరు.. వాళ్ల కలలన్నీ నోట్ల ఫెళఫెళల్లో కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ తమను పట్టించుకోలేదని శివపాల్ వాపోయారు. ఇప్పటికీ తాము బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈలోగా తాము చిన్న పార్టీలతో కలిసి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ అలయన్స్ (పీడీఏ) ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని అన్ని 80 స్థానాల నుంచి అభ్యర్థులను రంగంలోకి దించుతామని స్పష్టం చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో పీడీఏ తరఫున ప్రచారం చేయబోయే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో పార్టీ అధ్యక్షుడు శివపాల్ తో పాటు 20 మంది ఉన్నారు. వీరిలో శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ కాకుండా షాదాబ్ ఫాతిమా, పార్టీ ప్రతినిధి సీపీ రాయ్ పేర్లు ఉన్నాయి.