ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాక్..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాక్..

వరుస ఎన్నికల్లో విజయాలతో దూసుకుపోతన్న టీఆర్ఎస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్‌, నల్లగొండ ఉపాధ్యాయ, కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో ఎక్కడా ఆ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన పాతూరి సుధాకర్‌ రెడ్డి ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. ఆయన ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనతోపాటు నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం అభ్యర్థి పూల రవీందర్‌ కూడా ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఇద్దరూ అనూహ్యంగా ఓడిపోవడం సంచలనమైంది.

కరీంనగర్‌ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి రఘోత్తం రెడ్డి, నల్లగొండ స్థానం నుంచి నర్సిరెడ్డి విజయం సాధించారు. ఇక, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. జీవన్ రెడ్డికి 56,698 ఓట్లు రాగా... తన ప్రత్యర్థిపై 39,430 ఓట్లతో మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. ఇక సుగుణాకర్ రావుకు 15,077 ఓట్లు రాగా, చంద్ర శేఖర్ గౌడ్‌కు 17,268 ఓట్లు, రంజిత్ మోహన్‌కు 6,601 ఓట్లు, రాణిరుద్రమదేవికి 5,196 వచ్చాయి. ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య 9,932గా ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి అధికారంలోకి రావటం, అనంతరం విపక్షంలో స్వల్ప సంఖ్యలో మిగిలిన ఎమ్మెల్యేల్లో అత్యధికులతోపాటు సీనియర్‌ నేతలు టీఆర్‌ఎస్‌ వైపు క్యూ కట్టిన పరిస్థితుల్లో వెలువడిన ఈ ఫలితాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.