వారణాసి నుంచి పోటీ చేయనా? కార్యకర్తలకు ప్రియాంక గాంధీ ప్రశ్న

వారణాసి నుంచి పోటీ చేయనా? కార్యకర్తలకు ప్రియాంక గాంధీ ప్రశ్న

ఉత్తరప్రదేశ్ లో గాంధీ కుటుంబ కంచుకోటలు అమేథీ, రాయ్ బరేలీలలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా మకాం వేశారు. ఆలయ నగరం అయోధ్యకు వెళ్లే ముందు స్థానిక నాయకత్వం, శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రియాంక నిన్న, ఇవాళ ఈ రెండు నియోజకవర్గాలను చుట్టేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టిన తర్వాత తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారి పర్యటించిన ప్రియాంక వాద్రాకు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. 2019 ఎన్నికలు నిజానికి, అబద్ధాలకు మధ్య చావోరేవో తేల్చే పోరాటమని రాయ్ బరేలీలో కార్యకర్తలకు ప్రియాంక చెప్పారు. తమ పూర్తి శక్తిసామర్థ్యాలతో పోరాడి ఇక్కడి నుంచి ఐదోసారి పోటీ చేస్తున్న సోనియా గాంధీకి భారీ తేడాతో విజయం సాధించి పెట్టాలని సూచించారు. 

తను ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రియాంక గాంధీ సూచనప్రాయంగా ఒక సంకేతం ఇచ్చారు. నిన్న పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రియాంక, ఇవాళ మరింత స్పష్టతనిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసిలో ఎన్నికల సంగ్రామంలోకి దిగవచ్చనే సంకేతాలు అందించారు. రాయ్ బరేలీ పార్టీ కార్యకర్తలు ప్రియాంక వాద్రాను ఎన్నికల్లో నిలబడమని కోరగా వారణాసి నుంచి పోటీ చేయమంటారా? అని అడిగారు.

అమేథీ, రాయ్ బరేలీలలో బూత్ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రియాంక పర్యటించారు. ఆ తర్వాత ఈ హై ప్రొఫైల్ నియోజకవర్గాలకు తగినంత సమయం కేటాయించే పరిస్థితి ఉండకపోవచ్చని ఆరంభంలోనే ఆమె ఈ పర్యటన జరిపారు. గత ఎన్నికలలో ఆమె కొన్ని వారాల ముందుగానే మకాం వేసి రాహుల్, సోనియాలకు ఘన విజయం దక్కేలా కృషి చేశారు.