ఆ వయసుకి శుభ్ మాన్ ఆటలో 10% కూడా ఆడలేదు

ఆ వయసుకి శుభ్ మాన్ ఆటలో 10% కూడా ఆడలేదు

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా సోమవారం చరిత్ర తిరగ రాసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను వాటి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్ గెలుచుకొన్న మొదటి భారతీయ కెప్టెన్ గా విరాట్ రికార్డుల కెక్కాడు. సిరీస్ విజయం తర్వాత బహుమతి ప్రదానం సందర్భంగా కోహ్లీ ఒక యువ ఆటగాడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటివరకు ఐదు వన్డేల సిరీస్ లో జరిగిన మూడు పోటీల్లో ఒక్క మ్యాచైనా ఆడని ఆ ఆటగాడిని నెట్స్ లో చూసి ఆశ్చర్యపోయినట్టు కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. 

ఆ ఆటగాడెవరో కాదు.. టీమిండియాలోకి మొదటిసారి స్థానం సంపాదించిన శుభ్ మాన్ గిల్. గిల్ గత ఏడాది న్యూజిలాండ్ లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు. ఈ ఏడాది రంజీ సీజన్ లో శుభ్ మాన్ పరుగుల వరద పారించాడు. శుభ్ మాన్ ప్రదర్శనతో ప్రభావితులైన సెలక్షన్ కమిటీ, అతడిని న్యూజిలాండ్ కు పంపింది. డొమెస్టిక్ క్రికెట్ లో గిల్ ను అంతా జూనియర్ యువరాజ్ అని పిలుస్తారు. యువరాజ్ తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు శుభ్ మాన్. అందుకే రన్ మెషీన్ విరాట్ కూడా అతని బ్యాటింగ్ విన్యాసాలకు ఫిదా అయిపోయాడు. 

కివీస్ జట్టుతో మూడో వన్డేలో నెగ్గిన తర్వాత విరాట్ శుభ్ మాన్ గురించి చెబుతూ ‘ నేను నెట్స్ లో శుభ్ మాన్ బ్యాటింగ్ చేస్తుండగా చూశాను. 19 ఏళ్ల వయసులో అతని ఆటతీరు ఏ స్థాయిలో ఉందంటే నేను ఆ వయసుకి కనీసం 10% కూడా ఆడలేదు’ అన్నాడు.