ఎన్‌కౌంటర్‌: ఆస్పత్రిలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌... వారికి ఎలా ఉంది...?

ఎన్‌కౌంటర్‌: ఆస్పత్రిలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌... వారికి ఎలా ఉంది...?

దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.. పక్కా ప్లాన్ వేసి ఓ ఆడపిల్లపై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు తెలంగాణ పోలీసులు.. అయితే, దిశను దహనం చేసిన స్థలంలో ఆమె సెల్‌ఫోన్, వాచ్‌ పాతిపెట్టినట్టు నిందితులను చెప్పడంతో.. వారిని అక్కడికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు పోలీసులు. ఫోన్, వాచ్‌ అక్కడ పెట్టాం.. ఇక్కడ పెట్టామంటూ టైం వృథా చేసిన నిందితులు.. ఆ తర్వాత పోలీసులపై రాళ్లతో, కర్రలతో దాడికి దిగారు.. కొద్దిసేపటి తర్వాత పోలీసుల దగ్గర నుంచి రెండు వెపన్స్ లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఇక నిందితుల దాడిలో ఓ ఎస్సైతో పాటు మరో కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి.. ఈ దాడిలో గాయపడిన నందిగామ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌కు కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితిపై కేర్ వైద్యులు ఓ ప్రకటన చేశారు. నిందితుల దాడిలో ఎస్సై వెంకటేశ్వర్లు తలకు గాయం అయినట్టు చెబుతున్నారు.. కానిస్టేబుల్ అరవింద్ గౌడ్‌ కుడి భుజంపై కర్ర గాయాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఆ ఇద్దరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని.. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేర్ వైద్యులు వెల్లడించారు. కాగా, పోలీసులపై దాడికి దిగి పారిపోయేందుకు యత్నించిన నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే.