కర్ణాటకలో మళ్లీ మొదలైంది..! సీఎం యడియూరప్పకు కొత్త టెన్షన్‌..!

కర్ణాటకలో మళ్లీ మొదలైంది..! సీఎం యడియూరప్పకు కొత్త టెన్షన్‌..!

కర్ణాటకలో మళ్లీ కొత్త రాజకీయం మొదలైందా? బీజేపీని గద్దెదింపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారా? ఇలాంటి ఉత్కంఠ మళ్లీ నెలకొంది... కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి సర్కార్‌ను కూల్చి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు యడియూరప్ప... దీంతో.. ఇక, కర్ణాటకానికి అంతా తెరపడినట్టే భావించారు.. కానీ, ఇప్పుడు మాత్రం సీఎం యడియూరప్పకు టెన్షన్ పట్టుకుందట.. ఎందుకంటే.. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.. సీఎం యడియూరప్ప పని తీరుపై ఉత్తర కర్ణాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు.. అయితే, సిద్దరామయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు తనను కలిశారని, వారందరూ నిత్యం తనతో టచ్‌లోనే ఉన్నారని బాంబు పేల్చారు సిద్ధరామయ్య.. అంతేకాదు.. వారందరు యడియూరప్ప పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించి.. కొత్త రాజకీయానికి తెరలేపారు. 

ఇక, సిద్ధరామయ్య వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిపోయింది.. అయితే, ఈ వ్యవహారం మొత్తం బీజేపీ అంతర్గత వ్యవహారమని, తాము యడియూరప్ప సర్కార్‌ను అస్థిరపరచే ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంటోంది కాంగ్రెస్‌ పార్టీ.. మరోవైపు.. సిద్దరామయ్య కామెంట్లపై స్పందించిన కర్ణాటక బీజేపీ.. ఓటమి నుంచి సిద్దరామయ్య ఇంకా కోలుకోవడం లేదని, అందుకే ఇలాంటి అర్థం పర్థం లేని మాటలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనతో ఎందుకు కలుస్తారని ప్రశ్నించారు బీజేపీ నేతలు.. అయితే, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేదా? అటుంచితే.. సిద్దరామయ్య వ్యాఖ్యలు మాత్రం బీజేపీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. మరి ఆ రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.