బాలాకోట్ లో చెట్లను కూల్చారా? ఉగ్రవాదులనా?

బాలాకోట్ లో చెట్లను కూల్చారా? ఉగ్రవాదులనా?

పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారతీయ వాయుసేన పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లలో చొరబడి జైషే మొహమ్మద్ కి చెందిన పలు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ లో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యపై రాజకీయం ఊపందుకుంటోంది. పంజాబ్ ప్రభుత్వంలో మంత్రి, కాంగ్రెస్ నేత నవ్ జోత్ సింగ్ సిద్ధూ దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే ఆయన సైన్యాన్ని రాజకీయాల కోసం ఉపయోగించవద్దని సలహా ఇచ్చారు.

సిద్ధూ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. అందులో '300 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అవునా కాదా? అయితే ఈ దాడి ఉద్దేశం ఏంటి? మీరు ఉగ్రవాదులను చంపడానికి వెళ్లారా లేదా చెట్లని కూల్చడానికా? ఇది ఎన్నికల స్టంట్ మాత్రమేనా? విదేశీ శత్రువులతో పోరాటం పేరుతో మీరు మన ప్రజలను మోసం చేశారు. సైన్యాన్ని రాజకీయాలను ఉపయోగించడం మానుకోండి' అని రాసిన సిద్ధూ చివరలో 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అని ఎద్దేవా చేశారు.

దిగ్విజయ్ సింగ్ కూడా ఎయిర్ స్ట్రైక్ రుజువులు కోరారు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా 'అమెరికా ఎలాగైతే ఒసామా బిన్ లాడెన్ ను చంపినట్టు రుజువులు చూపించిందో, అదే విధంగా మనం కూడా ఎయిర్ స్ట్రైక్ రుజువులు చూపించాలి' అని చెప్పారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాద దాడి జరిగిన 13వ రోజున భారత్ పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉన్న బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో పాటే పీఓకేలోని ముజఫరాబాద్, చకోటీ లలో కూడా జైషే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్ కి చెందిన 40 మంది జవాన్లు మరణించారు.