రివ్యూ : సిల్లీ ఫెలోస్ 

రివ్యూ : సిల్లీ ఫెలోస్ 

నటీనటులు : అల్లరి నరేశ్‌, సునీల్‌, చిత్ర శుక్లా, పూర్ణ, జయప్రకాశ్‌ రెడ్డి, ఝాన్సి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, చలపతిరావు తదితరులు 

మ్యూజిక్ : శ్రీవాసంత్ 

నిర్మాత : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి 

దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు 

రిలీజ్ డేట్ : 07-09-2018

అల్లరి నరేష్ అంటే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఒకప్పుడు టాలీవుడ్ లో చెప్పుకునేవారు.  ఇటీవల కాలంలో హిట్ శాతం తగ్గిపోవడంతో.. సంవత్సరానికి రెండు మూడు సినిమాలతో సరిపెట్టుకుంటున్నాడు.  అటు కమెడియన్ సునీల్ కూడా కమెడియన్ నుంచి హీరోగా మారి కొన్ని సినిమాలు చేశారు.  హీరోగా పెద్దగా కలిసి రాకవడంతో మరలా కమెడియన్ గా మారిపోతున్నాడు.  అల్లరి నరేష్ కు సుడిగాడు వంటి మంచి హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

జయప్రకాశ్ రెడ్డి ఓ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటాడు.  ఆ ఎమ్మెల్యేకు నమ్మినబంటు ఇంకా చెప్పాలంటే రాంబంటుగా ఉంటాడు నరేష్.  ఇందులో నరేష్ స్వార్ధం ఉంది.  జయప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవిని అలంకరిస్తే తాను ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాడు.  ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి చేత కొన్ని మంచి పనులు చేయించేందుకు సిద్దమవుతాడు.  ఇందులో భాగంగా సామూహిక వివాహ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమౌతాడు.  ఈ కార్యక్రమం అభాసుపాలవ్వకుండా ఉండేందుకు నరేష్ తన స్నేహితుడైన సునీల్ కి బలవంతంగా ఓ చిత్రతో పెళ్లి చేస్తాడు.  ఇక తన ప్రియురాలు పూర్ణను పోలీస్ ను చేయడానికి ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి చేత రూ. లక్షలు లంచం ఇప్పిస్తాడు. ఈ సమయంలో చిత్రకు, సునీల్ కు గొడవలు జరిగి విడిపోవాలని అనుకుంటారు.  అందుకు జయప్రకాశ్ రెడ్డి సాక్ష్యం కావాలి.  ఇదే సమయంలో జయప్రకాశ్ రెడ్డికి ఓ ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్తాడు.  ఇక జయప్రకాశ్ రెడ్డి దగ్గర రూ.500 కోట్లకు సంబంధించిన ఓ రహస్యం ఉందనితెలుస్తుంది .. మరి జయప్రకాశ్ రెడ్డి కోమాలోనుంచి బయటకు వచ్చాడా..? ఆ రూ.500 కోట్లు ఎవరివి..? అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

కామెడీ సినిమాల్లో కథ గురించి పెద్దగా ఆలోచించాంగాని,  కథనాలు.. అందులో నుంచి వచ్చే హాస్యమే సినిమాకు ప్రధాన ఆధారంగా నిలుస్తుంది.  అందుకే దర్శకుడు ప్రతి సన్నివేశంలో హాస్యం ఉండేలా చూసుకున్నాడు . ఇది కొంతవరకు మంచి ఫలితాన్నే ఇచ్చింది.  సాదాసీదా కథ అయినప్పటికీ.. సన్నివేశాలను అల్లుకున్న తీరుబాగుంది.  ఫస్ట్ హాఫ్ లో వచ్చే హాస్యసన్నివేశాలు ఫ్రెష్ గా ఉండటమే కాకుండా.. కొత్తగా అనిపించాయి.  పోలీస్ క్యారెక్టర్ లో బ్రహ్మానందం పండించిన కామెడీ సినిమాకు ఒక ప్లస్ అయింది.  పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి కూడా ఆటోలో వచ్చే సీన్స్ ను దర్శకుడు బాగా చిత్రీకరించాడు.  సెకండ్ హాఫ్ కొంత సహనాన్ని పరీక్షించే విధంగా ఉన్నది.  ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డిని కిడ్నాప్ చేసే సీన్స్ పాతగా ఉన్నాయి.  పోసాని.. జయప్రకాష్ రెడ్డి ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.  సెకండ్ హాఫ్ అక్కడడక్కడా మినహా మిగతా భాగం పెద్దగా పండలేదు.  ఫస్ట్ హాఫ్ లోఒకపాట, సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ మాత్రమే ఉంది.  రెండు పాటలు బాగున్నాయి.  కామెడీ సినిమాల్లో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఇందులోనూ అలాగే ఉన్నది.  కొత్తగా ఏమి లేదు.  

నటీనటుల పనితీరు : 

అల్లరి నరేష్ కామెడీ గురించి వంకలు పెట్టడానికి ఏమి ఉండదు.  అన్నిసినిమాల్లో పేరడీలు ఉంటాయి.  ఈ సినిమాలో అవేమి లేకుండా కామెడీ సింపుల్ గా ఉంది.  సునీల్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.  సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా స్కోప్ ఉండదు.  ఇక కామెడీ సినిమాల్లోనైతే చెప్పాల్సిన అవసరం లేదు.  ఉన్నారంటే ఉన్నారు అంతే.  జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, పోసానిలు కామెడీతో ఆకట్టుకున్నారు. 

సాంకేతిక వర్గం పనితీరు : 

దర్శకుడు భీమనేని సుడిగాడు వంటి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తెరకెక్కించి ఉంటాడు.  కొంతవరకు పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ ను ఆ పట్టును తీసుకురాలేకపోయాడు.  కథనాల్లో ఇంకాస్త కామెడీని జొప్పిస్తే బాగుండేది.  ఉన్న రెండు పాటలు బాగున్నాయి.  తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఉన్నదాంట్లో క్వాలిటీ పరంగా బాగానే తీర్చిదిద్దారు.  

పాజిటివ్ పాయింట్స్ : 

ఫస్ట్ హాఫ్ 

పాటలు 

నరేష్, సునీల్ 

నెగెటివ్ పాయింట్స్ : 

సెకండ్ హాఫ్ 

సన్నివేశాల్లో సాగతీత. 

చివరిగా:  సిల్లీ ఫెలోస్ ల కామెడీ పంట