23శాతం పెరిగిన వెండి ధర..! కిలో రూ.52వేల వైపు పరుగులు..!

23శాతం పెరిగిన వెండి ధర..! కిలో రూ.52వేల వైపు పరుగులు..!

ఈ ఏడాది ప్రారంభంలో రూ.37,000గా ఉన్న వెండి ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది.. ఈ సంవత్సరం వెండి ధరలు 23 శాతం పెరగడంతో ఏకంగా కిలో వెండి ధర ఇప్పుడు రూ.48 వేలకు పైగానే పలుకుతోంది.. అయితే, వెండి ధర మరింత పైకి ఎగబాకడం ఖాయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.. ఇది కాస్త వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే రూ.50 వేల నుంచి రూ.52 వేల మధ్య పలుకుతోందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదా క్షీణించే ధోరణికి భిన్నంగా వెండికి దేశీయ మరియు విదేశీ మార్కెట్లలోనూ సానుకూల ధోరణి ఉంటుందని సూచిస్తున్నారు. ఇక, వెండి, వెండి నగల ఎగుమతులు ఏడాదికి 76.12 శాతం పెరిగి రూ .3,936.31 కోట్లకు చేరుకున్నాయని చెబుతున్నారు. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నుండి వెండి ధరల్లో మరింత కదలిక ఉంటుందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు, విశ్లేషకులు.. బులియన్ డైరెక్టర్ ముఖేష్ కొఠారి మాట్లాడుతూ, 2020 మొదటి త్రైమాసికం నాటికి వెండి ధర కిలోకు రూ.50,000-52,000కు చేరుకుంటుందని.. ఈ ఏడాది ప్రారంభంలో కిలో వెండి రూ.37,000గా ఉందని గుర్తు చేశారు. అంతేకాదు ఈ ఏడాది పండుగ సీజన్‌లో వెండికి మంచి డిమాండ్ ఉందని.. పీఎన్‌జీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఈ సంవత్సరం వెండి అమ్మకాలు పెరిగాయని... వెండి, వెండి నాణేలు, వెండి ఆభరణాలు మంచి వృద్ధిని చూపించాయని. చాలా మంది యువకులు ఇప్పుడు వెండి నగలవైపు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు.