సింగరేణి లాభాల్లో 27 శాతం ఇస్తాం: సీఎం కేసీఆర్

సింగరేణి లాభాల్లో 27 శాతం ఇస్తాం: సీఎం కేసీఆర్

2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో 27 శాతం వాటా సింగరేణి కార్మికులకు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. గత ఏడాది 25 శాతం వాటాగా ఇచ్చామని ఈసారి మరో 2 శాతం పెంచి 27 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రోజు ప్రగతి భవన్ లో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆధ్వర్యంలో తమ హామీలను నెరవేర్చినందుకు కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీబీజీకేఎస్ నాయకులు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణి అధికారులు మాజీ సైనికుల సంక్షేమం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన 8 ఏళ్ల పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం ఆదేశించారు. సింగరేణి అధికారులు హైదరాబాద్‌లో ఇండ్లు నిర్మించుకోవడానికి అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు. సింగరేణి కార్మికుల మాదిరిగానే సంస్థలోని అధికారులు, ఉద్యోగులకు కూడా ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణాన్ని అందివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇకపై సింగరేణిలో కార్మికులను వర్కర్లు అని పిలవొద్దు. వారిని కూడా ఉద్యోగులుగానే సంభోదించాలి. యాజమాన్యం, కార్మికులు వేర్వేరు అనే భావన విడనాడాలి. అంతా ఒక కుటుంబమనే భావన పెంపొందాలని సీఎం ఆకాంక్షించారు.