హాంకాంగ్ లో హింసాత్మకంగా మారిన నిరసన ప్రదర్శనలు

హాంకాంగ్ లో హింసాత్మకంగా మారిన నిరసన ప్రదర్శనలు

హాంకాంగ్ లో వివాదాస్పద అప్పగింత బిల్లుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని చైనాకు అప్పగించే ఈ బిల్లుపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆదివారం రికార్డు స్థాయిలో పది లక్షల మందికి పైగా నిరసన ప్రదర్శన చేశారు. 1997లో హాంకాంగ్ ను బ్రిటన్ చైనాకు అప్పగించిన తర్వాత మిలియన్ మార్చ్ చేశారు. ఇప్పుడు దానికి మించి పెద్ద ఎత్తున ప్రజలు ఈ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ బిల్లుతో తమ జీవితాలు చైనా చేతిలోకి వెళ్లిపోతాయని.. దేశ స్వయం ప్రతిపత్తి దెబ్బ తినే ప్రమాదం ఉన్నందువల్ల ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

చైనాకు నేరస్థుల అప్పగింతపై చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన తెలిపారు. ప్రభుత్వ భవనాల చుట్టూ రోడ్లను దిగ్బంధించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులను అడ్డుకోబోయారు. పోలీసులపై ఇటుకలు, చేతికందిన వస్తువులను రువ్వారు. నిరసన తెలుపుతూ ఆందోళనకారులు ఒక్కసారిగా హాంకాంగ్ సెంట్రల్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 22 మంది ప్రజలు గాయపడ్డారు. ఆందోళన కారణంగా చట్టసభల్లో చర్చ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 

ఓ వైపు ప్రజాందోళన ఎగసి పడుతుంటే చైనా అనుకూల నేతలు మాత్రం ఈ బిల్లుపై వెనక్కి తగ్గేదే లేదని కుండబద్దలు కొడుతున్నారు. హాంకాంగ్ ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయంగా మారరాదని..చొరబాటుదారులను ప్రవేశించకుండా నిరోధించేందుకే ఈ బిల్లు తెస్తున్నట్టు చెబుతున్నారు. ఈ బిల్లుపై బుధవారం యథావిధిగా చర్చ జరుగుతుందని హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ చెప్పడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ బిల్లును ఆమోదించి తీరుతామని చెప్పింది. ముందుగా అనుకున్న ప్రకారం జూన్ 20న బిల్లును ఆమోదించి చట్టం చేయాల్సి ఉంది.