కళ్లు తిరిగే స్కైవాక్.. అదిరే ఫొటోలు

కళ్లు తిరిగే స్కైవాక్.. అదిరే ఫొటోలు

పేరులోనే ఉన్నట్టు స్కైవాక్ అంటే ఆకాశంలో నడయాడడమే. గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ ఒకవైపు.. కాళ్ల కింద ఏమీ లేని ఫీలింగ్ మరోవైపు. గుండె వేగం రెట్టింపయ్యే ఈ స్కై వాక్ మూడు రోజుల క్రితమే బ్యాంకాక్ లో సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. ఇహ అప్పట్నుంచి స్కైవాక్ కు సెల్ఫీల కోసం వచ్చి సోషల్ మీడియాలో పోస్టు చేసేవారికి లెక్కేలేదు. అయితే బలహీనమైన గుండె కలిగినవారు స్కైవాక్ మీద అడుగు పెట్టకపోవడమే మంచిదంటున్నారు నిర్వాహకులు. 

బ్యాంకాక్ లో 70 అంతస్తులకు పైగా ఎత్తులో కింగ్ పవర్ మహానఖా అనే స్కైవాక్ ను నిర్మించారు. 1030 అడుగుల ఎత్తులో సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. 74, 75వ అంతస్తులో అబ్జర్వేషన్ డెక్ ను కొలువుతీర్చారు. ఇక్కడి నుంచి సిటీ అందాలను వీక్షించవచ్చు. ఇక 78వ అంతస్తులో పూర్తిగా పైన రూఫ్ టాప్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేశారు. ఇక్కడే బార్ కూడా ఉంది. ఇక్కడి నుంచి బ్యాంకాక్ సిటీని 360 డిగ్రీల్లో పూర్తిగా చూడొచ్చు. 

ఇక ఈ స్కైవాక్ లోకి షూ లతో వెళ్లేందుకు అనుమతించరు. అంతా గ్లాసు మీదే నడవాల్సి ఉంటుంది కాబట్టి.. మనం వేసుకున్న షూ ల మీద క్లాత్ తో చేసిన మృదువైన గ్లోవ్స్ లాంటివి వేసుకోవాలి. ఇలాంటిదే గ్లాసుతో చేసిన బ్రిడ్జి చైనాలో ఒకటుంది.