శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం

శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం

లంక స్టార్ ఓపెనర్ దనుష్క గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్‌సీ)నిషేధం విధించింది. టెస్ట్, వన్డే, టీ-20 లలో నిషేధం విధించింది. ఈ మేరకు ఆదివారం శ్రీలంక  క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్ఎల్‌సీ ప్రారంభ విచారణ తరువాత ఈ నిర్ణయం తీసున్నామని తెలిపింది. ప్లేయర్ కోడ్ కండక్ట్ నియమావళిని ఉల్లంఘించినందుకు నిషేధం విధించామని పేర్కొంది. అయితే గుణతిలక నిషేధంపై సంబంధించి ఎలాంటి స్పష్టమైన వివరాలు తెలపలేదు. గుణతిలకపై కేసు విచారణం జరుగుతోంది.

కొలంబోలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టు ముగిసిన వెంటనే సస్పెన్షన్ అమలులోకి వస్తుంది. అంతేకాక విచారణ ఫలితం వచ్చే వరకు మ్యాచ్ కోసం గుణతిలక యొక్క ఫీజును రద్దు చేయాలని ఎస్ఎల్‌సీ నిర్ణయించింది. ఈ మధ్య కాలంలో శ్రీలంక జట్టు నామమాత్రపు ప్రదర్శన మాత్రమే చేస్తుంది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ దనుష్క గుణతిలకపై నిషేధం పడటంతో జట్టు పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. సరైన కారణం తెలుపకపోయినా ఫామ్ లో ఉన్న ఈ ఓపెనర్ పై నిషేధం  పడిందంటే పెద్ద తప్పే చేసుంటాడని భావించొచ్చు.

ఇంతకుముందు గుణతిలక క్రమశిక్షణ ఉల్లంఘించిన కారణంగా ఎస్ఎల్‌సీ ఆరు మ్యాచ్‌‌ల నిషేధం విధించింది. అనంతరం ఈ నిషేధంను మూడు మ్యాచ్‌‌ల కు కుదించింది. లేట్ నైట్ పార్టీలు చేసుకోవడం, మ్యాచ్ డే రోజు కిట్ లేకుండా మైదానానికి రావడంతో అతడిపై వేటు పడింది. గత జనవరిలో భారత్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో భాగంగా గుణతిలకపై వేటు పడింది.