ఏపీలో కలవరపెడుతున్న పాముకాట్లు

ఏపీలో కలవరపెడుతున్న పాముకాట్లు

కృష్ణా జిల్లా ప్రజలను పాముల భయం వెంటాడుతుంది. భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున పాములు బయటికి వస్తున్నాయి. ప్రాణభయంతో ప్రజలను కాటేస్తున్నాయి. దీంతో అనేక మంది ఆస్పత్రులపాలవ్వడమే కాక మరికొందరు మృతవాత పడ్డారు. 22 రోజుల్లో జిల్లాలోని అవనిగడ్డ ఆసుపత్రికి 85 మంది బాధితులు క్యూకట్టారు. అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో పాముకాటుకు గురైన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. దివిసీమలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతులు పాముకాట్లకు గురవుతూనే ఉండటంతో పొలం పనులకు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.

గుంటూరు జిల్లా తీర ప్రాంతాల్లో కూడా వరుస పాముకాట్లతో పంటపోలాల్లోకి దిగేందుకు రైతులు, కూలీలు బెంబేలెత్తిపోతున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి, రేపల్లె రూరల్ మండలాల్లోని పంట పొలాల్లో నాట్లు వేస్తూ రెండు రోజుల్లోనే 40 మంది పాము కాటుకు గురై రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  పది రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు పూర్తిస్ధాయిలో నీటిలో మునిగిపోవడంతో గట్లపై ఉన్న పాములు నారుమడుల్లోకి చేరి నారు తీసే వారిని కాటు వేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.