వేసవి తాపం.. ఏసీలో తిష్టవేసిన పాము..

వేసవి తాపం.. ఏసీలో తిష్టవేసిన పాము..

రెయిన్ సీజన్ వచ్చినా వర్షాలు ఇంకా సరైన రీతిలో కురవడం లేదు.. ఎండలు మండుతూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఎండవేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రజలే కాదు..  జంతువులు, పాములు కూడా ఎండవేడికి అల్లాడిపోయాయే. అయితే వేసవి తాపంతో ఏసీలోకి దూరిన ఓ పాము.. దాదాపు మూడు నెలలుగా ఏసీలోనే తిష్టవేసిన ఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో జరిగింది. ఓ ఇంట్లో ఉన్న ఏసీ యంత్రంలో పాము ఉన్న ఘటన కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న తెంగాయితిట్టు సాయి జీవా సరోజానగర్‌కు చెందిన ఏలుమలై ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఏసీ ఉంది. ఆ యంత్రం నుంచి తరచూ శబ్దం వస్తుండడంతో మెకానిక్‌ను పిలిపించాడు. యంత్రాన్ని విప్పి చూసే సమయంలో రెండు పాము కుబుసాలు కనిపించాయి. దీంతో కొంత షాక్ తిన్న మెకానిక్.. జాగ్రత్తగా పరిశీలించగా అందులో ఓ పామును గుర్తించాడు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు... దాంతో 2 గంటలపాటు శ్రమించి ఆ పామును బయటకు తీశారు ఫారెస్ట్ సిబ్బంది. ఆ పాము రెండడుగుల పొడవు ఉంది. అయితే, ఏసీ యంత్రాన్ని బిగించిన సమయంలో బయటి పైపును ఉన్న హోల్‌ను సరిగా మూయకపోవడంతో పాము ఏసీలోకి దూరిఉండొచ్చు అంటున్నారు. ఏసీ నుంచి దాదాపు మూడు నెలల నుంచి ఇలాంటి శబ్ధాలే వస్తున్నాయని ఏలుమలై చెబుతున్నారు. అంటే, మూడు నెలలుగా ఏసీలోనే తిష్టవేసిందా ఆ పాము.