పీకల్లోతు అప్పుల్లో అంబానీ.. సాధారణ జీవితం గడుపుతున్నా..!

పీకల్లోతు అప్పుల్లో అంబానీ.. సాధారణ జీవితం గడుపుతున్నా..!

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్‌ అంబానీ.. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారట. ఒక్క కారు మాత్రమే ఆయన వాడుతున్నారట.. ఆఖరికి చట్టపరమైన ఖర్చుల కోసం ఇంట్లోని బంగారాన్ని కూడా అమ్మేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. యూకే హైకోర్టు విచారణకు ఇండియా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన... ప్రస్తుత తన జీవన శైలి, ఆస్తులు, అప్పుల గురించి తెలియజేశారు. అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్‌ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకోడానికి పలు బ్యాంకులు లండన్‌లో కోర్టును ఆశ్రయించాయి. ఆయన ఆస్తులను బహిర్గతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాయి. దీనిలో భాగంగానే  కోర్టుకు తన పరిస్థితిని వివరించారు అనీల్‌ అంబానీ. మొత్తానికి బకాయిలు చెల్లించేందుకు తన దగ్గర ఇంకేం మిగల్లేదంటూ రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ చేతులెత్తేశారు. కోర్టు ఖర్చుల కోసం నగలన్నీ అమ్మేయాల్సి వచ్చిందని బ్రిటన్‌ న్యాయస్థానం ధర్మాసనం ముందు వాపోయారు అంబానీ. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ధనవంతుల్లో ఒకరైన ముకేష్‌ అంబానీకి స్వయానా సోదరుడైన అనిల్ అంబానీ.. దేశంలోని కార్పొరేట్‌ ప్రముఖుల్లో ఒకరు.. కోర్టులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చగా మారింది.