టీఆర్ఎస్‌కు షాక్: సోమారపు రాజీనామా..

టీఆర్ఎస్‌కు షాక్: సోమారపు రాజీనామా..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ... ఓవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలు అధికార పార్టీలో చేరుతుండగా.. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాత్రం టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. గతంలో రామగుండం నుంచి స్వతంత్రంగా పోటీ చేసి గెలిచన తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఆయన... తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మరోసారి రామగుండం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే, రామగుండంలో నా ఓటమికి బాల్క సుమన్‌తో పాటు మరికొందరు నేతలే కారణమని ఆరోపించారు. కాగా, ఈ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి చందర్ విజయం సాధించాడు. ఆ తర్వాత చందర్ కూడా  టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడిన సోమారపు సత్యనారాయణ.. పార్టీలో తనకు తగిన గౌరవం లేదని ఆరోపించారు. సభ్యత్వ నమోదులోనూ తనకు, తన అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని.. అందుకే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీలో కలిసి పనిచేయడం సాధ్యం కావడం లేదు.. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని తెలిపారు. అయితే, తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతోన్న సమయంలో ఆయన కమలం గూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. కాగా, సోమారపు సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్‌గా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.