పోలవరాన్ని కేంద్రమే చేపట్టాలి..

పోలవరాన్ని కేంద్రమే చేపట్టాలి..

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. చంద్రబాబుపై కక్ష సాధింపుతో పోలవరాన్ని జగన్ ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే ప్రాజెక్టు సంక్షిష్టమయ్యే ప్రమాదం ఉందని, వెంటనే కేంద్రం పనులను ప్రారంభించాలని కోరారు సోమిరెడ్డి. కేంద్ర నిధులు కాబట్టి.. జగన్ వ్యవహారం తేడాగా ఉంది.. అందుకు కేంద్రమే పోలవరాన్ని చేపట్టాలన్నారు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టును చేపడితే కేంద్రానికే మంచి పేరు వస్తుందన్నారు. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కాబట్టి కేంద్రం పోలవరాన్ని చేపట్టే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. 

ఇక, పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ సరికాదని మేం చెప్పడం కాదు.. హైకోర్టే చెప్పిందన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పంతానికి పోయి పోలవరం ప్రాజెక్టును దిక్కులేని ప్రాజెక్టులా మార్చొద్దన్న ఆయన.. చంద్రబాబు మీద, టీడీపీ మీద కోపంతో ప్రాజెక్టులపై కక్ష సాధించొద్దన్నారు. రాజధాని, పోలవరం విషయంలో జగన్ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. జగన్ వైఖరితో వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సోమిరెడ్డి.. పనులన్నీ ఆపేసి ఆకాశం వైపు చూసే పరిస్థితులు ఉన్నాయనన్నారు. పోలవరం, రాజధాని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.