4 రోజుల్లో సమీక్ష..! ఎవరు అడ్డుకుంటారో చూస్తా..?

4 రోజుల్లో సమీక్ష..! ఎవరు అడ్డుకుంటారో చూస్తా..?

ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు కాస్త సీఎం వర్సెస్ చీఫ్ సెక్రటరీగా మారిపోయింది. సీఎం సమీక్షకు వెళ్లిన అధికారులకు ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు సీఎస్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, నేను నాలుగు రోజుల్లో వ్యవసాయ శాఖపై సమీక్ష చేస్తా..? ఎవరు అడ్డుకుంటారో చూస్తా? అంటూ ఎన్నికల కమిషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎవరైనా నా సమీక్షని అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు మంత్రి... రాష్ట్రంలో పరిపాలన సాగకూడదని కేసీఆర్.. ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఈసీ... సీఎం, మంత్రులు ఇంట్లో కూర్చోవాలని అంటే సహించం.. మాకు ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోం... కానీ, పరిపాలించడం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నారు మంత్రి సోమిరెడ్డి. 2004లో 6 నెలలు ముందు రాజీనామా చేసినా రాష్ట్రానికి కేర్ టేకర్‌గా చంద్రబాబే ఉన్నారని గుర్తుచేసిన మంత్రి... ప్రభుత్వం యథావిథిగా విధులు నిర్వర్తిస్తుంది అని సీఈసీ చెప్పిన మాట విజయసాయిరెడ్డికి గుర్తు లేదా? అంటూ మండిపడ్డారు. మరోవైపు తెలంగాణలో విద్యార్థులు చనిపోవడానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా బాధ్యత వహించేది? ఈసీనా? అని ప్రశ్నించారు సోమిరెడ్డి... తెలంగాణలో విద్యార్థుల మరణాలకు టీఎస్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఏడాదికి ఒక పార్టీలో చేరి ఆనంకి మతిమరుపు వచ్చింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి.. రిజర్వ్ బాంక్ గైడ్‌లైన్స్‌ తెలియని ఆనం.. ఆర్థిక మంత్రిగా ఎలా పనిచేశారని ఎద్దేవా చేశారు.