సోమనాథ్‌ ఛటర్జీ కన్నుమూత

సోమనాథ్‌ ఛటర్జీ కన్నుమూత

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ (89) కన్నుమూశారు. కోల్‌కతా ఆస్పత్రిలో ఇవాళ ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న సోమనాథ్‌ను వైద్యం కోసం ఆగస్టు 10 న కోల్‌కతాలోని ఆస్పత్రిలో చేర్పించారు. సోమనాథ్‌ గత జూన్‌లో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. జులైలో శ్వాససంబంధ సమస్యతోనూ హాస్పిటల్‌లో చేరినా.. కొద్ది రోజుల కిందటే డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఇవాళ తుది శ్వాస విడిచారు.

తండ్రి మరణంలో బరిలోకి...
అసోంలోని తేజ్‌పూర్‌లో 1929 జూలై 25న సోమనాథ్‌ జన్మించారు. 1952లో న్యాయ విద్యలో పట్టా అందుకున్న సోమనాథ్‌.. కొన్నేళ్లపాటు సుప్రీం కోర్టు, కోల్‌కతా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ కూడా చేశారు. జులై 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ 2008 వరకు.. అంటే 40 ఏళ్లు ఆ పార్టీలో కొనసాగారు. 1971లో ఎంపీగా ఉన్న తన తండ్రి నిర్మల్‌ ఛటర్జీ మృతిచెందడంతో సోమ్‌నాథ్‌ ఎన్నికల్లో పోటీచేయాల్సి వచ్చింది. తండ్రి సొంత నియోజకవర్గమైన పశ్చిమ్‌బంగలోని బర్ద్వాన్‌ నుంచి బరిలోకి దిగి తొలిసారిగా ఆయన విజయం సాధించారు. లోక్‌సభకు అత్యధిక సార్లు ఎన్నికైన ఎంపీల్లో సోమ్‌నాథ్ కూడా ఒకరు. 1971 నుంచి 2009 వరకూ మధ్యలో 1984లో ఒక్కసారి తప్ప అన్ని ఎన్నికల్లోనూ గెలుపొందారు. 1984 ఎన్నికల్లో ప్రస్తుత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు సోమనాథ్‌ ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. సోమ్‌నాథ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.