క‌రోనాని జ‌యించిన అమ్మ‌.. క‌నిక‌రించ‌ని కొడుకు..

క‌రోనాని జ‌యించిన అమ్మ‌.. క‌నిక‌రించ‌ని కొడుకు..

క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో మాన‌వ‌త్వాన్ని మంట‌గ‌లిపే ఘ‌టన‌‌లు ఎన్నో వెలుగుచూశాయి.. మ‌రికొన్ని హృద‌యాల‌న్ని క‌దిలించే క‌థ‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.. తాజాగా.. క‌రోనా నుంచి కోలుకుని ఆనందంగా ఇంటికి చేరుకున్న ఓ త‌ల్లికి నిరాశ ఎదురైంది.. ఆస్పత్రిలో నిద్రలు లేని రాత్రులు గ‌డిపిన ఆమె.. సొంతింటిలో కంటి నిండా నిద్ర పోదామనుకుంది.. కానీ, రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఆమెను కుమారుడు, కోడలు ఇంట్లోకి రానివ్వలేదు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్ బీజేఆర్ న‌గ‌ర్‌లో జ‌రిగింది.. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బీజేఆర్‌ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మ‌హిళ.. ఇటీవ‌లే క‌రోనాబారిన‌ప‌డింది.. దీంతో, గాంధీఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు వైద్యులు.. శుక్రవారం నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రావ‌డంతో.. సాయంత్రం ఆమెను డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు గాంధీ ఆస్ప‌త్రి వైద్యులు.. సంతోషంగా ఇంటికి చేరిన ఆ త‌ల్లికి అవమానం ఎదురైంది. ఇంట్లోకి రానివ్వ‌కుండా అడ్డుకున్న కొడుకు, కోడలు.. అంతే కాదు.. ఇంటి పైకప్పు రేకులను తొలగించి.. ఆ ఇంటికి తాళం వేసి ఎక్క‌డికో వెళ్లిపోయారు.. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి.. రోడ్డుపై రాత్రంతా జాగారం చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.. ఓవైపు వ‌ర్షం కూడా కుర‌వ‌డంతో.. ఆమె ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఈ ఘ‌ట‌న చూసి చ‌లించిపోయిన స్థానికులు.. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చినా ఉప‌యోగం లేకుండా పోయింది.. ఎలాగైనా త‌న‌కు అధికారులే న్యాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తుంది ఆ మ‌హిళ‌.