..ఇక 6 రియర్ కెమెరాల స్మార్ట్ ఫోన్ రాబోతోంది!!

..ఇక 6 రియర్ కెమెరాల స్మార్ట్ ఫోన్ రాబోతోంది!!

ఈ రోజుల్లో దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్ వెనకవైపు రెండు, అంత కంటే ఎక్కువ కెమెరాలతో వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ కెమెరాలు ఉంటే డెప్త్ సెన్సింగ్, వైడ్ షాట్, ఆప్టికల్ జూమ్ వంటి వివిధ అంశాలు మెరుగవుతాయి. దీంతో ఇప్పుడు సోనీ కూడా కెమెరాల విషయంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. రెండు, మూడు కాకుండా ఏకంగా ఆరు రియర్ కెమెరాలతో స్మార్ట్ ఫోన్ తయారు చేస్తోంది. 

స్మార్ట్ ఫోన్ టిప్స్ ఇచ్చే మ్యాక్స్ జె అనే వ్యక్తి @Samsung_News_ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో సోనీ కొత్త ఎక్స్ పీరియా స్మార్ట్ ఫోన్ తయారీలో ఉన్నట్టు చెప్పాడు. ఇందులో వెనకవైపు 6 లెన్స్ లు ఉంటాయని తెలిపాడు. అంతే కాకుండా ఈ డివైస్ ముందువైపు రెండు కెమెరాలు కూడా ఉండబోతున్నాయి. 6 కెమెరా లెన్స్ లు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్న ఫోన్ ఇమేజ్ షేర్ చేశాడు. అయితే ఇది అసలైన ఎక్స్ పీరియా ఫోన్ చిత్రం కాదు. కేవలం దాని కాన్సెప్ట్ మాత్రమే. ప్రస్తుతానికి ఎక్స్ పీరియా ఫోన్ అభివృద్ధి దశలోనే ఉన్నందువల్ల దాని డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు తెలియడం లేదు.

సోనీ తన కొత్త డివైస్ లో 6 రియర్ కెమెరాలను అమర్చుతుండటంతో ఈ ఫోన్ లో కూడా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లో మాదిరిగానే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 వంటి హై ఎండ్ ప్రాసెసర్, మీడియాటెక్ 5జీ ప్రాసెసర్, లేదా మరేదైనా చిప్ సెట్ ఉండవచ్చు. ఇప్పటి వరకు వన్ ప్లస్ 7 ప్ర్ఓ, శాంసంగ్ గెలాక్సీ ఎస్10+ మూడు కెమెరాలు, హానర్ 20 ప్రో 4 కెమెరాలు, నోకియా 9 ప్యూర్ వ్యూ ఐదు కెమెరాలతో వచ్చాయి. కానీ ఇప్పుడు సోనీ ఎక్స్ పీరియా ఏకంగా 6 రియర్ కెమెరాలతో వస్తుండటంతో ఇందులో ఇంకెన్ని విశేషాలు ఉండబోతాయో అనే ఆసక్తి ఏర్పడింది.