అందరం దేశం కోసమే ఆడాము: గంగూలీ

అందరం దేశం కోసమే ఆడాము: గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవెల్ టెస్ట్ కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు రవిశాస్త్రి మాట్లాడుతూ... ప్రస్తుత భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. మంచి విజయాలను సాధిస్తుంది. గత మూడేళ్లలో విదేశాల్లో 9 మ్యాచులు, మూడు సిరీస్‌లు గెలిచింది. గత 15-20 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని విజయాలు సాధించిన జట్టు లేదు. అప్పటి జట్లలో కూడా గొప్ప ఆటగాళ్లు ఉన్నారు అని రవిశాస్త్రి అన్నారు.

ఈ వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. సునీల్‌ గావస్కర్‌ కూడా రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. తాజాగా సౌరవ్‌ గంగూలీ స్పందించారు. 'అవి అపరిపక్వ వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ, నేను భారతదేశానికి ఆడినప్పుడు.. ధోనీ ఆడుతున్నప్పుడు లేదా ఇప్పుడు విరాట్ ఆడుతున్నప్పుడు అన్ని తరాల వాళ్లం దేశం కోసమే ఆడాము. అందరం టీమిండియాకు చెందిన వాళ్లమే అని అన్నారు. ఒక తరంతో మరొక తరం క్రికెటర్లని పోల్చుతూ మాట్లాడడం సరికాదన్నారు. నేను కూడా చాలా మాట్లాడగలను. భారత్‌ కోసం విరాట్ సేన కష్టపడే ఆడుతోందని' పేర్కొన్నారు.