దక్షిణ రైల్వేలో హిందీ తప్పనిసరి చేయడంపై వివాదం

దక్షిణ రైల్వేలో హిందీ తప్పనిసరి చేయడంపై వివాదం

తమిళనాడులో మరోసారి హిందీపై వివాదం రగులుకుంటోంది. ఈ సారి రైల్వే విడుదల చేసిన ఒక సర్కులర్ పై వివాదం రాజుకుంది. రైల్వే జోనల్ కంట్రోల్ అధికారులు, స్టేషన్ మాస్టర్లు తప్పనిసరిగా ఇంగ్లిష్, హిందీలలోనే సంభాషించాలని ఆదేశిస్తూ దక్షిణ రైల్వే సర్కులర్ విడుదల చేసింది. మేలో జారీ అయిన ఈ సర్కులర్ శుక్రవారం మీడియాలో వెలుగు చూసింది. దీనిపై శుక్రవారం తమిళనాడులో వివాదం భగ్గుమంది. ప్రస్తుతానికైతే దీనిపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారుల సమక్షంలో ఈ సర్కులర్ ఉపసంహరించారు. తమపై హిందీని రుద్దేందుకు చేస్తున్న మరో ప్రయత్నంగా ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేసింది. 

ఈ అంశం ఒక దుర్ఘటనతో మరింత చెలరేగింది. కొన్ని రోజుల క్రితం మదురై జిల్లాలో ఇద్దరు స్టేషన్ మాస్టర్ల మధ్య భాషా సమస్య కారణంగా రెండు రైళ్లు ఒకే పట్టాలపై నడవడం జరిగింది. ఈ ఘటన కారణంగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. 

హిందీని రుద్దుతున్న రైల్వే సర్కులర్ ను 'అహంకార పూరితం'గా డీఎంకే అధ్యక్షుడు ఎం కె స్టాలిన్ అభివర్ణించారు. ఫేస్ బుక్ లో తమిళంలో పెట్టిన పోస్టులో స్టాలిన్ 'వాళ్లు పదేపదే తమిళుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇలాగే చౌకబారు ఆదేశాలను జారీ చేయడాన్ని వెంటనే ఆపకపోతే మనం వారిపై పూర్తి నిషేధం విధిద్దామని' పిలుపునిచ్చారు. డీఎంకే చీఫ్ సూచనల మేరకు పార్టీ ఎంపీ దయానిధి మారన్ సర్కులర్ కి వ్యతిరేకంగా దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ రాహుల్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఎస్ అనంతరామన్ లకు వినతిపత్రం అందజేశారు. తక్షణమే ఆ సర్కులర్ ను ఉపసంహరిస్తున్నట్టు అధికారులు వారికి హామీ ఇచ్చారు.