ఇక సామాన్య భక్తులకు కూడా కల్యాణం లడ్డూ !

ఇక సామాన్య భక్తులకు కూడా కల్యాణం లడ్డూ !

సామాన్య భక్తులకు కల్యాణం లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. ఇప్పటి వరకు వీఐపీలు, సేవా టికెట్లు ఉన్నవారికే దొరికే కల్యాణం లడ్డూ.. ఇకపై అందరికీ లభించనుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకూండా నేరుగా కౌంటర్లో భక్తులు కోనుగోలు చేసుకునే విధానం మొదలైంది. తిరుమలకు వచ్చే భక్తులంతా శ్రీవారి దర్శనం తర్వాత.. అంత ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. టీటీడీ మూడు రకాల లడ్డూ ప్రసాదాలు తయారు చేయిస్తుంది. 25 గ్రాములు ఉండే చిన్న లడ్డూని.. భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. 175 గ్రాములు వుండే లడ్డూ ప్రసాదాన్ని శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా పంపిణి చేస్తోంది టీటీడీ.

అదనంగా కావాలంటే భక్తులు 50 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. మూడోది పెద్ద లడ్డూ. దీన్నే కల్యాణం లడ్డూగా వ్యవహరిస్తారు. ఆర్జిత సేవలు చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖలు ఉన్న భక్తులకు మాత్రమే కల్యాణం లడ్డూ విక్రయించేది టీటీడీ. అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రతి రోజూ 4 వేల కల్యాణం లడ్డూలు అందుబాటులో ఉంటాయి. ఆర్జిత సేవ భక్తులకు 3 వేలు పోనూ.. ఇక వెయ్యి లడ్డూలే ఉండేవి. దీంతో వీటికి ఫుల్ డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు కల్యాణం లడ్డూలు అందరికీ అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో వడ ప్రసాదం కూడా అందుబాటులో ఉంచే యోచనలో ఉంది. టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.