ఎన్నికలకు సిద్ధమవుతున్న వరంగల్ లో తెరపైకి కొత్త చర్చ..!

ఎన్నికలకు సిద్ధమవుతున్న వరంగల్ లో తెరపైకి కొత్త చర్చ..!

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో ఓరుగల్లులో కొత్త రగడ తెరపైకి వచ్చింది. దీక్షా పైలాన్‌ ఏర్పాటు ఏకపక్షమా? ఏకాభిప్రాయంతో జరిగిందా అన్నదానిపై అధికారపార్టీలో చర్చతోపాటు రచ్చ కూడా అవుతోంది. ఈ అంశంపై ఫిర్యాదు చేద్దామని భావించినవాళ్లు సైతం సైలెంట్‌ కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

వరంగల్‌లో పైలాన్‌ రగడ!

ఓరుగల్లులో అధికారపార్టీ రాజకీయాలను దీక్షా దివస్‌ పైలాన్‌ వేడెక్కిస్తోంది. ఈ పైలాన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నాలుగైదు రోజుల్లోనే ఆ పని పూర్తి కావడం.. ఆగమేఘాలపై ఆవిష్కరించడం జరిగిపోయింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌లు పైలాన్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేపట్టిన మలిదశ ఉద్యమంలో భాగంగా   కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్షకు గుర్తుగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవరణలో 10 లక్షలతో పైలాన్‌ ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీఆర్‌ఎస్‌ రథసారథికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏకపక్షంగా నిర్వహించారని కొందరు అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారట. చెప్పలేదని కొందరు.. తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని మరికొందరు.. ఉద్యమ నేతల పేర్లు లేవని ఇంకొందరు ఇలా ఎవరికి వారు నిరసన స్వరాలు వినిపిస్తున్నారట. 

తెరపైకి కొత్త పరిణామాలు?

సీఎం కేసీఆర్‌ దృష్టిలో పడే కార్యక్రమం కావడం వల్లే  ఇతర టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వకుండా ప్రారంభించేశారని ఓ వర్గం  అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారని వినికిడి. త్వరలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సమాయత్తం అవుతున్న సమయంలో ఈ సమస్య ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని అంతా ఆందోళన చెందారట. ఇంతలో హైదరాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కావడంతో అక్కడ పైలాన్‌ ప్రారంభోత్సవాన్ని ఇష్యు చేస్తారని అనుమానించారట. కానీ సీన్‌ మారిపోవడంతో  కొత్త పరిణామాలు తెరపైకి వచ్చాయి. 

బీజేపీ విమర్శలతో ఒక్కటైన టీఆర్‌ఎస్‌ నేతలు!

టీఆర్‌ఎస్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి కార్పొరేషన్‌ ఆవరణలో పైలాన్‌ ఎలా ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేయడంతో... అప్పటి వరకు గుర్రుగా ఉన్న టీఆర్‌ఎస్‌ అసంతృప్తి వర్గాలు సైతం గళం సవరించుకున్నాయట. కార్పొరేషన్‌ సమావేశంలోనూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రజల అటెన్షన్‌ తీసుకొచ్చేందుకు రెండు పార్టీలు దీనిపై మాటల యుద్ధానికి  దిగాయి. తాజా ఎపిసోడ్‌.. పైలాన్‌ ఏర్పాటు చేసిన అధికారపార్టీ నేతలకు మోదం తీసుకొస్తే.. అప్పటి వరకు పిలవలేదన్న ఖేదంలో ఉన్నవారు గొంతు సవరించక తప్పలేదు. బీజేపీ విమర్శలతో పైలాన్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ నేతలంతా ఒక్కటైపోయారు. 

ఏకపక్షమా? ఏకాభిప్రాయమా అన్న చర్చ ఆగలేదా? 

సమస్య మొత్తం కొత్త టర్న్‌ తీసుకోవడంతో.. పైలాన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా తలెత్తిన అంశాలు మరుగున పడ్డాయి. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి... విమర్శలతో విరుచుకుపడటానికి ఒక అంశమైతే దొరకింది. కాకపోతే పైలాన్‌ ఏర్పాటు ఏకపక్షమా..? ఏకాభిప్రాయామా అన్న చర్చకు మాత్రం కొందరు ఫుల్‌స్టాప్‌ పెట్టడం లేదట. మరి.. ఎన్నికల సమయానికి ఈ సమస్య ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.