ఐపీఎల్ వేలం జూదాన్ని తలపించిందా..?

ఐపీఎల్ వేలం జూదాన్ని తలపించిందా..?

కొంత మంది ప్లేయర్లు జాక్ పాట్ కొట్టారు. మరి కొంత మందికి అసలు ఛాన్సే రాలేదు. ఫ్రాంఛైజీల వ్యూహాలేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆట, నైపుణ్యాన్ని బట్టి కాకుండా.. అదృష్టాన్ని బట్టే ఆటగాళ్లకు ధర పలికింది. అసలు ఫ్రాంఛైజీలు క్రికెట్ ఆడటానికి ప్లేయర్లను కొనుక్కుంటున్నాయా.. లేకపోతే డబ్బుతో జూదమాడుతున్నాయా అనేది అర్థం కాని పరిస్థితి. ఈసారి ఐపీఎల్ వేలంపై సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోలింగ్ నడుస్తోంది. కొంత మంది ప్లేయర్లు జాక్ పాట్ కొట్టారు. మరి కొంత మందికి అసలు ఛాన్సే రాలేదు. ఫ్రాంఛైజీల వ్యూహాలేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆట, నైపుణ్యాన్ని బట్టి కాకుండా.. అదృష్టాన్ని బట్టే ఆటగాళ్లకు ధర పలికింది. అసలు ఫ్రాంఛైజీలు క్రికెట్ ఆడటానికి ప్లేయర్లను కొనుక్కుంటున్నాయా.. లేకపోతే డబ్బుతో జూదమాడుతున్నాయా అనేది అర్థం కాని పరిస్థితి. ఈసారి ఐపీఎల్ వేలంపై సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోలింగ్ నడుస్తోంది. ముంబై.. అర్జున్ టెండూల్కర్ ను తీసుకోవడం, సన్ రైజర్స్.. హైదరాబాదీ ప్లేయర్లను తీసుకోకపోవడం, బెంగళూరు మరోసారి పేలవ వ్యూహం అవలంబించడం.. ఇలా ఆక్షన్లో సిత్రాలు చాలా ఉన్నాయి. 

చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ ఆక్షన్.. వేలం వెర్రిలా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనూహ్యంగా కొంత మంది ఆటగాళ్లకు ధర పలకడం, బాగా ఆడే ప్లేయర్లు తక్కువ రేటుకు పరిమితం కావడం ఆశ్చర్యం కలిగించింది. ఫ్రాంఛైజీలు ఓ వ్యూహం లేకుండా... జూదం మాదిరిగా వేలంలో పాల్గొని.. క్రికెట్ కు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. 

చెన్నై వేదికగా బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ జరిగింది. 1114 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. మొత్తం 298 మందికి అనుమతి దక్కింది. ఈ లిస్టులో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అనూహ్యంగా సౌతాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను అత్యధిక ధర 16.25 కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది. గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ చరిత్రలో ఇదే భారీ మొత్తం. క్రిస్ మోరిస్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో అతడిని ఆర్సీబీ రిలీజ్ చేసింది. బేస్ ప్రైస్ 75 లక్షల నుంచి 16.25 కోట్ల వరకు పలికిన మోరిస్‌ను చివరికి రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది. యువరాజ్ సింగ్ తర్వాత 16 కోట్లు దాటిన రెండో ఆటగాడిగా క్రిస్ మోరిస్‌ రికార్డు సృష్టించాడు.

ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మళ్లీ జాక్‌ పాట్‌ కొట్టేశాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని 14.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 5 కోట్ల నుంచి చెన్నై, బెంగళూరు అతడిని దక్కించుకొనేందుకు విపరీతంగా పోటీపడ్డాయి. చెన్నై వద్ద తక్కువ మొత్తమే ఉండటంతో.. 14 కోట్ల వరకు ప్రయత్నించి చివరకు వదిలేసింది. అయితే గత సీజన్లో మ్యాక్స్ వెల్ పేలవ ప్రదర్శన చేసినా.. ఇంత భారీ మొత్తం చెల్లించడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. కేవలం డ్రింక్స్ తాగడానికే మ్యాక్స వెల్ ఐపీఎల్ కు వచ్చినట్టుందని.. గత సీజన్లో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అయితే బిగ్ బాష్ లీగ్ లో ప్రదర్శన ఆధారంగా ఫ్రాంఛైజీలు పోటీపడి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

ఇంటర్నేషనల్ క్రికెట్లో మంచి రికార్డున్నా.. ఐపీఎల్ లో పెద్దగా రాణించని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను 2.20 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. మొదటిగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ స్టీవ్ స్మిత్‌పై దృష్టి సారించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం పాటలో 2.20 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దీనితో ఈ ఏడాది వేలం పాటలో మొదటిగా అమ్ముడైన ప్లేయర్‌ గా స్టీవ్ స్మిత్ పేరు నమోదైంది. 

తమిళనాడు ఫినిషర్‌ షారుఖ్ ఖాన్‌ కోట్లు కొట్టేశాడు. 20 లక్షల రూపాయల కనీస ధరలో ఉన్న అతడిని పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా 5.25 కోట్ల రూపాయలు పెట్టి సొంతం చేసుకుంది. షారుఖ్ కోసం బెంగళూరు కూడా ఆసక్తి ప్రదర్శించింది. దాంతో రెండు జట్లు ధరను పెంచుకుంటూ వెళ్లాయి. గతంలో షారుఖ్ ఖాన్‌ అండర్‌-19 ప్రపంచకప్‌, ఐపీఎల్‌ మిస్సైనా ఈ సారి మాత్రం జాక్‌పాట్‌ దక్కించుకున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో షారుఖ్ ఖాన్ రాణించడంతో.. పంజాబ్ అతడికి భారీ ధర చెల్లించింది. వేలంలో గెలిచామని తెలియగానే ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతీ జింటా చపట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ రియాక్షనే ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షారుఖ్ మన టీమ్ అయితే ఆనందం కాదా.. అంటూ బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ను గుర్తుతెచ్చేలా నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. వీర్-జార ఒక్కటైపోయారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ అయితే షారుఖ్ ఖాన్ ఇప్పుడు పంజాబ్ కింగ్ అని సరదాగా పేర్కొంది. 

కర్నాటక ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ ఐపీఎల్‌ వేలంలో మంచి ఛాన్స్ దక్కించుకున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని 9.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అతడి కనీస ధర 20 లక్షల రూపాయలు. గతంలో కృష్ణప్ప పంజాబ్‌కు ఆడాడు. వేలంలోకి రాగానే అతడి కోసం హైదరాబాద్‌, కోల్‌కతా పోటీ పడ్డాయి. ధర పెంచుకుంటూ వెళ్లాయి. హైదరాబాద్‌ 7.5 కోట్ల రూపాయలకు బిడ్‌ వేసినప్పుడు అనూహ్యంగా చెన్నై రంగంలోకి దిగింది. ఆఖరికి 9.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

ఇక ఆస్ట్రేలియన్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ మెరిశాడు. పంజాబ్‌ జట్టు ఏకంగా 14కోట్ల రూపాయలు పెట్టి ఈ యువ స్పీడ్‌గన్‌ను సొంతం చేసుకుంది. రిచర్డ్‌సన్‌ను దక్కించుకోవడానికి ఢిల్లీ, బెంగళూరు, ముంబయి చివరివరకూ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియన్‌ టీ20 స్పెషలిస్టు మ్యాక్స్​వెల్​ను వదులుకున్న పంజాబ్‌ ఆ స్థానంలో రిచర్డ్‌సన్‌ను తీసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మ్యాక్స్​వెల్​ను వదులుకున్న పంజాబ్‌ జట్టు మళ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. యువ పేసర్‌ మెరెడిత్‌ను ఏకంగా 8కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. అతడి కోసం ఢిల్లీ, పంజాబ్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ వెనక్కి తగ్గింది. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ విదేశీ క్రికెటర్​కు ఇంత ధర దక్కడం ఇదే తొలిసారి. ఇంతకుముందు జోఫ్రా ఆర్చర్​ 7.2 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాడు.

సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. 20 లక్షల రూపాయల బేస్ ధరకు అతడ్ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. మరే ఫ్రాంఛైజీ అర్జున్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. అర్జున్ ను ముంబై కొనుక్కోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సచిన్ కొడుకు అవ్వడం వల్ల అతనికి ఈజీగా ఐపీఎల్ లో చోటు దక్కిందని..ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ వేలానికి ముందే సచిన్ కొడుక్కి ముంబై జెర్సీ దక్కిందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏ రూల్ ప్రకారం అర్జున్ ను ముంబై జట్టులోకి తీసుకున్నారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో బెటర్ రికార్డు లేకపోయినా, కేవలం సచిన్ కొడుకు అన్న ట్యాగ్ తోనే ఐపీఎల్ ఎంట్రీ దక్కిందంటూ విమర్శిస్తున్నారు. ఈ లెక్కన రాహుల్ గాంధీని కూడా ఆటగాడిగా తీసుకుంటారా అని మండిపడుతున్నారు. 

ఐపీఎల్ వేలంలో  పలువురు స్టార్ అంతర్జాతీయ ప్లేయర్స్ తక్కువ ధరకు అమ్ముడుపోగా.. అంచనాలు లేని కొంతమంది ఆటగాళ్లు మాత్రం భారీ రేటు పలికారు. ఇక సీనియర్, వెటర్నర్ ప్లేయర్స్‌కు మాత్రం ఈ వేలంలో నిరాశే మిగిలింది. చాలామంది ఫ్రాంచైజీలు వారిని అసలు ఎంపిక చేయలేదు. తమ జట్ల కూర్పును బలపరుచుకునే భాగంలో ఎక్కువగా యువ కెరటాలను ఎంచుకున్నారు. నయావాల్ గా పేరొందిన ఛటేశ్వర్ పుజారాను 2014 తర్వాత మొదటిసారి కొనుగోలు చేశారు. 50 లక్షల రూపాయల బేస్ ప్రైస్ దగ్గర  చెన్నై సూపర్ కింగ్స్ పూజారాను కొనుగోలు చేసింది. ఈసారి ఆల్ రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లకు ఫ్రాంఛైజీలు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. అయితే బాగా ఆడే ఆటగాళ్లను పట్టించుకోకుండా.. అనామకులకు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడమేంటనే విమర్శలు వస్తున్నాయి. ఫ్రాంఛైజీలు సరైన హోమ్ వర్క్ చేయకుండానే ఆక్షన్ కు వస్తున్నాయని.. ఆక్షన్లో ముందు పేరొస్తే.. ఆ ఆటగాళ్ల పంట పండుతోందని, వెనక వస్తున్న ప్లేయర్లు నష్టపోతున్నారని సీనియర్లు కూడా నిట్టూరుస్తున్నారు. ఆట, నైపుణ్యాన్ని బట్టి ఆటగాళ్లను ఎంపిక చేయాలని కానీ.. అదృష్టం, నంబర్ గేమ్ ఆధారంగా కాదని మండిపడుతున్నారు.