మైలవరం పల్లెపోరులో క్లీన్ స్వీప్ అయ్యేది ఎవరు ..?

మైలవరం పల్లెపోరులో క్లీన్ స్వీప్ అయ్యేది ఎవరు ..?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ మాజీ మంత్రికి ఆనవాళ్లు లేకుండా చేద్దామని లెక్కలు వేసుకున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. కానీ.. సొంత పార్టీ కేడర్‌ ఇచ్చిన షాక్‌తో ఎమ్మెల్యేకు మైండ్‌ బ్లాంక్‌ అయిందట. విషయం తెలుసుకుని గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథ? 

మైలవరంలో ఎమ్మెల్యే వసంత, దేవినేని ఉమాల మధ్య  వైరం!

కృష్ణాజిల్లా మైలవరం రాజకీయాలు ఎప్పుడూ హాట్‌హాట్‌గానే ఉంటాయి. ఎన్నికలు లేకపోయినా వైసీపీ, టీడీపీ మధ్య వైరం ఉప్పు నిప్పులా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా మహేశ్వరరావు గత ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా చేశారు.  2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ చేతిలో ఓడిపోయారు ఉమా. రాజకీయంగా ఉమా, వసంత కుటుంబాల మధ్య వైరం ఉంది. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు  సమయం నుంచి అది అలా కొనసాగుతోంది. 

మైలవరం పల్లెపోరులో క్లీన్‌స్వీప్‌ కోసం ఎమ్మెల్యే వసంత యత్నం!
ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చిన వైసీపీ శ్రేణులు!

ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే వసంత, దేవినేని ఉమా మధ్య ఆ ఫైట్‌ కనిపించింది. మైలవరంలో టీడీపీని, ఉమాను ఇరుకున పెట్టాలనే లక్ష్యంగా పల్లెపోరులో ఎమ్మెల్యే పావులు కదిపారు. నియోజకవర్గంలోని 60 పంచాయతీలలో కేవలం  నాలుగు చోట్ల మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 56 పంచాయతీలలో ఎన్నికలు జరగ్గా ఆరుచోట్ల టీడీపీ గెలిచింది. పక్కా వ్యూహంతో ఎన్నికలకు వెళ్లినా.. ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు ఎలా గెలిచారో ఎమ్మెల్యే వసంతకు తొలుత అర్థం కాలేదట. క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీసిన తర్వాత.. వైసీపీ నేతలే దానికి కారణంగా గుర్తించారట ఎమ్మెల్యే.

టీడీపీ గెలుపునకు వైసీపీ కేడరే కారణం? 

వైసీపీకి పట్టున్న మద్దులపర్వు, పాత నాగలూరు, అన్నేరావుపేట వంటి పంచాయతీలలో టీడీపీ మద్దతుదారులు గెలిచారు. ఇక్కడ జడ్పీటీసీ రేస్‌లో ఉన్న సొంత పార్టీ అభ్యర్థి వల్లే అలా జరిగిందని ఎమ్మెల్యే తెలుసుకున్నారట. టీడీపీ నేతలతో జడ్పీటీసీ క్యాండిడేట్‌ కయ్యానికి దిగడం వల్ల తెలుగు తమ్ముళ్లు కసిగా పనిచేశారట.  దీంతో అక్కడ ఓటమికి కారణమైనవారి గురించి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు వసంత. అంతేకాదు.. టీడీపీ చేతికి చిక్కిన ఆ మూడు పంచాయతీలను వైసీపీ గూటికి తెచ్చేందుకు ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. 

వసంత్‌ అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!

మొత్తానికి మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఝలక్‌ ఇద్దామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ నిర్ణయిస్తే.. దానికి భిన్నంగా వైసీపీ కేడర్‌ ప్రవర్తించడం ఆయనకు మింగుడు పడటం లేదట. ఏదో అనుకుంటే మరోదే అయిందని పార్టీ శ్రేణులపై వసంత గుర్రుగా ఉన్నారట. మైలవరం పరిణామాలపై అధికారపార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మరి.. పరిషత్ ఎన్నికల సమయానికి ఎమ్మెల్యే జాగ్రత్త పడతారో లేక కొత్త వ్యూహం అమలు చేస్తారో చూడాలి.