తిరుపతి ఉప ఎన్నికల్లో పాటల పంచాయతీ...!
వివాదాలకు ఏదీ అతీతం కావడం లేదు. అది మాట కావొచ్చు.. పాట కావొచ్చు. రచ్చ రచ్చ చేసుకోవడంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నాయి పార్టీలు. తిరుపతి ఉపఎన్నికల్లో అదే జరుగుతోంది. గీతాలు కాపీ చేశారని వైసీపీ, బీజేపీ నాయకులు అరిచి గీ పెడుతున్నారు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో పాటల గోల! ఒకే ట్యూన్‌తో పాడిన సాంగ్స్ వైసీపీ, బీజేపీ మధ్య వేడి పుట్టిస్తున్నాయి. రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న అని సింగర్ మంగ్లీ వైసీపీ కోసం ఒక పాట పాడితే.. ఇదే ట్యూన్లో భారతమాత ముద్దుబిడ్డ మోడీ అంటూ మరో సాంగ్ బీజేపీ ప్రచారంలో వినిపిస్తోంది.
పాట కోసం పంచాయితీ!
ఈ రెండు పాటల ట్యూన్ ఒక్కటే కావడంతో ప్రజలకంటే వేగంగా రెండు పార్టీల నాయకులు పాయింట్ క్యాచ్ చేశారు. ఎన్నికల్లో ప్రజల అటెన్షన్ తీసుకురావడానికి క్షణం ఆలస్యం చేయకుండా ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పనికి శ్రీకారం చుట్టేశారు నాయకులు. వివాదాలకు ఏదీ అతీతం కాదని నిరూపించారు.
వైసీపీకి పాటల గురించి ఏం తెలుసని బీజేపీ ప్రశ్న!
2014లోనే మోడీపై ఈ సాంగ్ సిద్ధం చేశామన్నది బీజేపీ నేతల వాదన. వైసీపీకి సాంస్కృతిక విభాగమే లేదని.. పాటల గురించి వారికేం తెలుసు? కరెప్షన్.. కలెక్షన్ తప్ప అని కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.
జాతీయ పార్టీగా ఉండి కాపీ చేస్తారా అని వైసీపీ విసుర్లు!
ఓసోసి.. మీరేనా.. మేము ఏమైనా తక్కువ తిన్నామా అని కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. మా పాటను మీరే కాపీ చేశారని తమదైన స్టయిల్లో కడిగేస్తున్నారు. బీజేపీ ఒక జాతీయ పార్టీగా ఉండి సొంతంగా పాట తయారు చేయించుకోలేక వైసీపీ సాంగ్ కాపీ కొట్టారని ఫైర్ అవుతున్నారు వైసీపీ నాయకులు.
యూట్యూబ్‌లో కోట్ల మంది వీక్షణ!
ఒకే ట్యూన్‌తో ఉన్న ఈ రెండు పాటలపై ఒకే స్వరంలో విరుచుకుపడుతున్నారు బీజేపీ, వైసీపీ నాయకులు. వీళ్ల గొడవ కాసేపు పక్కన పెడదాం. ఈ రెండు పాటల లింకులు ఓపెన్ చేస్తే యూట్యూబ్‌లో ఇంకాస్త ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ సాంగ్‌ను ఏడాది క్రితం అప్లోడ్ చేస్తే మూడున్నర కోట్ల మందికిపైగా చూశారు. బీజేపీ సాంగ్ అయితే వేర్వేరు పేర్లతో ఉంది. దానిని కూడా యూట్యూబ్‌లో ఏడాది క్రితమే అప్లోడ్ చేశారు. కొన్ని లింకుల్లో 3 మిలియన్లు. ఇంకొన్ని లింకుల్లో 5 వేల వ్యూస్ ఉన్నాయి.
సొంతంగా పాటలు రాయించుకుంటోన్న ఎమ్మెల్యేలు!
ఈ వివాదంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. అన్ని పార్టీలు పాటలను బాగానే వాడుకుంటాయి. సొంతంగా పాటలు రూపొందించి ప్రజల్లోకి వెళ్లేందుకు చూస్తాయి. ఈ ట్రెండ్ ఈ మధ్య పార్టీలను దాటి.. ఎమ్మెల్యేల వరకు వచ్చేసింది. ఎమ్మెల్యేలు ఎవరికివారుగా సొంతంగా పాటలు రాయించుకుని.. బాణీలు కట్టించుకుని జనాల్లోకి వదులుతున్నారు. డీజే సౌండ్స్ పెట్టి తమ పాటలకు.. అనుచరులతో స్టెప్పులు వేయించే పోకడలు పెరిగాయి. బాహుబలి సినిమాలోని దండాలయ్యా అనే సాంగ్‌ను తమకు అనుకూలంగా వాడుకోని పార్టీ లేదు.. నాయకుడు లేడు.
2019 ఎన్నికల్లో రావాలి జగన్.. కావాలి జగన్ పాట హిట్!
వైసీపీ వరకు వస్తే.. రాయలసీమ ముద్దుబిడ్డ సాంగ్‌తోపాటు తూర్పు దిక్కుల్లో ఉదయించే సూర్యుడా పాటను ఎక్కువగా పార్టీ ప్లే చేస్తుంది. ఇది కూడా బాగా పాపులర్ అయిన సాంగ్. రావాలి జగన్.. కావాలి జగన్ అనే పాట కూడా 2019 ఎన్నికల్లో సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పాలి.
టీడీపీ ప్రచారంలో మా తెలుగు తల్లికి పాట!
టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ మా తెలుగు తల్లికి మల్లెపూ దండతోపాటు చెయ్యి ఎత్తి జైకొట్టు తెలుగోడా అనే పాటను ఉపయోగించేవారు. ఆ రోజుల్లో అది టీడీపీ హిట్ సాంగ్. ఎన్టీఆర్ చైతన్య రథం వస్తుంటే ఆ పాట ఊదరగొట్టేవారు.
రాఘవేంద్రరావు డైరెక్షన్లో కదలిరండి పాట!
టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చాకా.. కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా సాంగ్‌ను రాఘవేంద్రరావు డైరెక్షన్లో ప్రత్యేకంగా రూపొందించి వదిలారు. అది జనాల్లోకి బాగానే వెళ్లింది. దివంగత్ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో పల్లె కన్నీరు పెడుతోంది అన్న పాటను విస్తృతంగా ఉపయోగించారు. ఆ సమయంలో అది కూడా హిట్ సాంగ్ అయింది. జనసేన కూడా పవన్ కల్యాణ్‌పై .. పార్టీ కోసం అనేక పాటలు రూపొందించింది. జనసైనికులకు హుషారెత్తించేలా వాటిని తీర్చిదిద్దారు.
పాటలు హెల్తీ టానిక్‌లా పనిచేస్తాయా?
పాటలు ఏవైనా.. పార్టీల లక్ష్యం ఒక్కటే. ప్రచారానికి అవి హెల్తీ టానిక్‌లా పనిచేస్తాయి. ప్రజల అటెన్షన్ తీసుకొస్తాయి. కేడర్‌ను ఉత్సాహ పరుస్తాయి. కానీ.. తిరుపతి ఉపఎన్నికలో మాత్రం పార్టీల మధ్య రగడ పాటతో మొదలైంది. రెండు అధికారంలో ఉన్న పార్టీలు కావడంతో ఆ స్థాయిలోనే మాటల దాడి చేసుకుంటున్నాయి. మరి.. పాటలతోపాటు.. ఈ పాటల పంచాయితీ వైసీపీ, బీజేపీలకు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)