సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారితో స్పెషల్ ఇంటర్వ్యూ

సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారితో స్పెషల్ ఇంటర్వ్యూ

గత శుక్రవారం విడుదలైన సినిమాల్లో సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'చి.ల.సౌ' కూడ ఒకటి.  మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలోని సంగీతాన్ని ప్రేక్షకులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.  అందుకే ఈ చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారితో ఎన్టీవీ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం... 

ముందుగా సినిమా సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?

చాలా హ్యాపీగా ఉందండి.  మంచి సినిమాను ఆడియన్స్ ఆదరిస్తున్నారు.  

సంగీత దర్శకుడిగా మీ కెరీర్ ఎలా మొదలైంది ?

నేను చెన్నైలోని ఏఆర్.రెహామన్ గారి కెఎమ్ మ్యూజిక్ కన్సర్వేటరీలో కోర్స్ చేశాను.  ఆ తరవాత ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ లో కూడ కొన్ని షాట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి వర్క్ చేశాను.  అదే పనిలో నా అనుభవం.  వాటి ద్వారానే 'వెళ్ళిపోమాకే' అవకాశం వచ్చింది.  ఆ తర్వాత 'మెంటల్ మదిలో' సినిమా చేశాను. 

'చి.ల.సౌ' సినిమాతో మీ జర్నీ ఎలా మొదలైంది ?

ఈ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గతంలో నేను చేసిన 'వెళ్ళిపోమాకే' చిత్రం చూసి నాతో  మాట్లాడారు.  శాంపిల్ ట్రాక్స్ చేయమని కూడ అడగలేదు. మొదటి మీట్లోనే నన్ను ఓకే చేసేశారు.  
ఈ సినిమాకు మ్యూజిక్ చేయడానికి ఎంత టైమ్ తీసుకున్నారు ?

సినిమా కథను రాహుల్ నాకు చాలా బాగా వివరించారు.  కథ నాకు బాగా నచ్చడం మూలాన ఈజీగా మ్యూజిక్ ఇవ్వగలిగాను.  కేవలం వారం రోజుల్లోనే ట్యూన్స్ కంపోజ్ చేసేశాను.  

రాహుల్ రవీంద్రన్ తో పనిచేయడం ఎలా ఉంది ? 

దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ కు ఎలాంటి సంగీతం కావాలో బాగా తెలుసు.  కథ మొత్తం నాకు డీటైల్డ్ గా వివరించారు.  ఆర్ట్ పట్ల నాకు, ఆయనకు ఒకే రకమైన అభిరుచులు ఉండేవి.  అందుకే ఇద్దరం చాలా త్వరగా సింక్ అయిపోయాం.  దాని ఫలితమే ఈ మంచి సంగీతం. 

ఇప్పటి వరకు అన్నీ కథాపరమైన సినిమాలే చేస్తూ వచ్చారు.. మరి కమర్షియల్ సినిమాలెప్పుడు చేస్తారు ?

 నా దృష్టిలో ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కువగా చూస్తే అదే కమర్షియల్ సినిమా.  నా సంగీతం నచ్చి నా దగ్గరకు ఎవరు వస్తే వాళ్ళతో పనిచేస్తాను.  నా మనసుకు నచ్చిన సినిమాలనే ఎంచుకుంటాను.  అప్పుడే మంచి సంగీతం ఇవ్వగలం. 

ఒక సంగీత దర్శకుడిగా సినిమా విజయంలో సంగీతం పాత్ర ఎంత ఉంటుందంటారు ?

సినిమా సక్సెస్ అకావడానికి కావల్సిన ముఖ్యమైన విషయాల్లో సంగీతం కూడ ఒకటి.  అసలు సినిమాను ఏ కోణంలో చూడాలో ప్రేక్షకుడికి చెప్పేది సంగీతమే.  ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుడ్ని గైడ్ చేస్తుంది.  అలా కాకుండా ఒక రకమైన సినిమాకి వేరే రకం సంగీతం ఇస్తే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది.  సినిమా విజయంలో మ్యూజిక్ పెద్ద పాత్రే పోషిస్తుంది. 

చి.ల.సౌ సినిమాకు దక్కుతున్న ఆదరణ పట్ల మీ ఫీలింగ్ ?

బాగుంది.  కానీ ఇంకా ఎక్కువమంది ప్రేక్షకులు సినిమాను ఆదరించాలి.  ఈ సినిమా కథను కొంచెం అడల్ట్ కంటెంట్ మిక్స్ చేసి హార్డ్ హిట్టింగా కూడ చెప్పొచ్చు.  కానీ రాహుల్ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగేలా చాలా చక్కగా సినిమాను తీశారు.  ఇలాంటి సినిమాల్ని ఎక్కువగా ఆదరించాలి.

భవిష్యత్తులో మ్యూజిక్ ఆల్బమ్స్ లాంటివి చేసే ఆలోచన ఏమైనా ఉందా ? 

మ్యూజిక్ ఆల్బమ్స్ కాదు కానీ స్పోర్ట్స్ మ్యూజిక్ వీడియోస్ చేయాలని కోరిక.  ఆ ప్లాన్స్ కూడ జరుగుతున్నాయి.  అలాగే ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి ఎక్కువగా పనిచేయాలని అనుకుంటున్నాను.  

కొత్త సినిమాలేవైనా ఒప్పుకున్నారా ?

ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి, వరుణ్ తేజ ల స్పేస్ థ్రిల్లర్ కి నేనే సంగీతం అందిస్తున్నాను.  అలాగే రవిబాబుగారు చేస్తున్న 'అదిగో' సినిమాకి వర్క్ చేశాను.  తమిళంలో కూడ షణ్ముఖ్ సుందర్ అనే కొత్త దర్శకుడు చేస్తున్న సినిమా కూడ చేశాను.