షోపియాన్ లో మహిళా ఎస్పీఓని కాల్చి చంపిన ఉగ్రవాదులు

షోపియాన్ లో మహిళా ఎస్పీఓని కాల్చి చంపిన ఉగ్రవాదులు

ఒకవైపు పాకిస్థాన్ శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు నుంచి తన అకృత్యాలకు ముగింపు పలకడం లేదు. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో మానాకోట్ దగ్గర పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత సైన్యం దీనికి ధీటుగా బదులిస్తోంది. ఇదిలా ఉండగా జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఘోరం జరిగింది. శనివారం ఉగ్రవాదులు షోపియాన్ జిల్లాలోని వెహిల్ గ్రామంలో ఎస్పీవో ఖుష్బూ జాన్ ను ఆమె ఇంటి బయట కాల్చి చంపారు. ఈ మధ్యాహ్నం తుపాకులతో వచ్చిన కొందరు 2.40 ప్రాంతంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. విషమ ఆరోగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

'ఉగ్రవాదులు శనివారం వెహిల్ గ్రామంలో మహిళా పోలీస్ అధికారి ఖుష్బూ జాన్ ను ఆమె ఇంటికి వెళ్లి కాల్చి చంపారు. ఈ సంఘటనలో ఆమెకు తీవ్రమైన గాయాలైనట్టు' ఈ ఘటన గురించిన సమాచారాన్ని జమ్ముకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేసి తెలియజేశారు. ఈ ఘటనతో షోపియాన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ముమ్మరంగా సోదాలు ప్రారంభించారు. సీఆర్పీఎఫ్ ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టింది. 

దాడి తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ దారుణ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించారు. మరణించిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీవో) కుటుంబంతో తాము ఉన్నామని ప్రకటించారు. జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రత్యేకంగా ఈ కేసును నమోదు చేసుకున్నారు. వెంటనే ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైన్యం లోయలో మిషన్ ఆలౌట్ ను కొనసాగిస్తోంది. ఇందులో అనేక మంది ఉగ్రవాదులను హతమార్చుతోంది. సైన్యం దూకుడు వైఖరితో ఉగ్రవాదులు బెంబేలెత్తుతున్నారు. కానీ సైన్యం లోయలో తమ మిషన్ ఇక ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది.