హోదా హైజాక్‌..

హోదా హైజాక్‌..

ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన అవిశ్వాస తీర్మాన ఘట్టం ముగిసింది. దాదాపు 12 గంటలపాటు సాగిన సుదీర్ఘ చర్చ తర్వాత రాష్ట్రానికి జరిగిందేంటి? ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిందా? విపక్షాలు టీడీపీకి బాసటగా నిలిచాయా? ఏమైనా హామీ లభించిందా? అంటే లేదు. పార్టీలన్నీ తమ సొంత ఎజెండాల ప్రకారం ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపుచ్చడం వినా ఏపీ కోసం మాట్లాడిన, వాదించిన పార్టీ ఒక్కటంటే ఒక్కటీ లేదు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాటలో ఏపీ ప్రజలను, వాళ్ల డిమాండ్లను నేతలంతా వాడుకున్నారు. సభను పొలిటికల్ గోదాగా మార్చుకున్న పార్టీలు తమ దంగల్ లో ఏపీని ఆటలో అరటిపండుగా మార్చేశారు. అసలు ఎవరినైతే కార్నర్ చేసి కర్రు కాల్చి వాత పెట్టాలనుకున్నారో అదే ప్రధాని మోడీ అయాచితంగా అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడేసుకున్నారు. టీడీపీతో పాటు మిగతా పార్టీలన్నిటిపై విమర్శల దాడి చేసి తన ప్రభుత్వ ఘనతను చాటి చెప్పుకొనేందుకు ఒక బహిరంగ సభగా మార్చేశారు.

చర్చను ప్రారంభిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గంటసేపు ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై గొంతు చించుకుంటే ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఇందులో జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అన్న తేడాలు లేవు. రాబోయే సాధారణ ఎన్నికలకు సన్నాహకంగా అంతా తాము వేసుకొన్న లెక్కల ప్రకారమే మాట్లాడారు తప్ప ఏపీ గుండె ఘోష వినిపించలేదు. రాహుల్ ప్రధాని అయితే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా అని చెబుతున్న కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 21వ శతాబ్దంలో ఏపీ రాజకీయ బాధిత రాష్ట్రమని రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన ఏఐసీసీ అధ్యక్షుడు ఆ తర్వాత ఏపీ ఊసే ఎత్తలేదు. తాము విభజన చట్టంలో ఇచ్చిన హామీలేంటో చెప్పలేదు. ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదో ప్రస్తావించలేదు. దేశం ఎదుర్కొంటున్న పెద్దనోట్ల రద్దు, మహిళల భద్రత, మూకోన్మాద దాడులు, జీఎస్టీ, డోక్లాం సరిహద్దులు వంటి సమస్యలు, రాఫెల్ కుంభకోణం, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి వ్యాపరవేత్తలు బ్యాంకులను ముంచేయడం అంటూ మోడీ ప్రభుత్వాన్ని ఎటాక్ చేయడానికే పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయమిది, దానికి న్యాయం చేయాలని మాటవరసకైనా అనలేదు. ఆయన తనకిచ్చిన సమయాన్నంతా తన సొంత ఇమేజ్, పార్టీ ప్రతిష్ఠ పెంచుకొనేందుకు వాడుకున్నారు. చివరలో ప్రధానిని కౌగిలించుకొని చర్చ కంటే ఎక్కువగా వార్తల్లోకెక్కారు.

నిన్న పార్లమెంటులో తమకు టీడీపీ ఇచ్చిన మంచి అవకాశాన్ని బీజేపీ పూర్తిగా వాడేసుకొంది. తమ మైలేజీ కోసం ఎంతో కష్టపడి అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ ప్రవేశపెడితే దానిని వారిపైకే ప్రయోగించారు మోడీ. తన ప్రసంగంలో చంద్రబాబు ఇమేజ్ ని ఎంత డ్యామేజీ చేయాలో అంతా చేశారు. 2016, సెప్టెంబ‌ర్‌లో చంద్రబాబు అంగీకారంతోనే ప్యాకేజీ ప్రక‌టించామ‌న్నారు. ప్రత్యేకహోదా వద్దని చంద్రబాబే అన్నారని.. హోదాకు మించిన స్థాయిలో ప్యాకేజీ రూపేణా ఇస్తున్న సాయానికి బాబు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని చేసిన విషయాన్నీ ప్రధాని గుర్తుచేశారు. బాబు త‌న వైఫ‌ల్యాల‌ు క‌ప్పి పుచ్చుకునేందుకు యూట‌ర్న్ తీసుకున్నార‌ని వ్యాఖ్యానించడం టీడీపీకి డ్యామేజీయే. ఈ అవిశ్వాసం త‌న‌ ప్రభుత్వంపై కాద‌ని, కాంగ్రెస్ తో ఎందరు మిత్రులున్నారో తెలుసుకొనేందుకని వ్యాఖ్యానించి టీడీపీని కాంగ్రెస్ మిత్రప‌క్ష జాబితాలో చేర్చేశారు. కేసీఆర్ పరిణితి చెందిన మంచి పాల‌నాద‌క్షత కారణంగా తెలంగాణ అభివృద్ధిలో ముందుంద‌ని చెబుతూ చంద్రబాబు డిఫెన్స్‌లో పడేశారు.  ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్టు చెబుతున్న చంద్రబాబును దెబ్బతీయడంలో సక్సెస్‌ అయ్యారు.  ఇక ప్రతిపక్షాలపై ఎదురుదాడి సరేసరి. ఇందులో మోడీని తప్పుబట్టాల్సిందేం లేదు. ఆయన తనకు వచ్చిన అవకాశాన్ని కచ్చితంగా ఎదురుదాడికి వాడుకుంటారు. అదే చేశారు.

రెండు జాతీయ పార్టీలు దేశసమస్యలను తలకెత్తుకున్నాయని అనుకున్నా స్థానిక సమస్యలు, ప్రాంతీయ వాదంతో పుట్టుకొచ్చిన పార్టీలదీ అదే తీరు. తమకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ప్రతి పార్టీని కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందం ప్రయత్నమంతా వృథా ప్రయాసగా మారింది. సభలో అవిశ్వాసానికి మద్దతిస్తామన్న పార్టీలన్నీ అక్కడితో తమ మాట నిలబెట్టుకున్నామని భావించినట్టున్నాయి. ఏ పార్టీ కూడా ఏపీ గురించి, విభజన సమస్యల గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు. అయ్యో పాపం.. విభజన కారణంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం అన్న కనికరమే లేదు. అందరికీ తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప ఎవరికీ ఏపీ గురించి చింత లేదు. చివరికి ఆంధ్రుల ఆవేదన హస్తినలో అరణ్య రోదనగా మిగిలింది.

అవిశ్వాసంపై చర్చకు కారణమే ఆంధ్రప్రదేశ్ అన్యాయమైతే ఆ విషయం ఎందుకు ఉపేక్షకు గురైంది? దీనికి అనేక కారణాలు. రాష్ట్రం తరఫున సమర్థంగా వాదన వినిపించడంలో ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారు. మోడీ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఢీకొనేటపుడు తగినంత కసరత్తు చేయాలి. ప్రణాళికలు రచించి వ్యూహాత్మకంగా అమలు చేయాలి. కానీ ఇవేవీ జరగలేదని టీడీపీ ఎంపీల పేలవ ప్రసంగాలతో స్పష్టమైంది. అవకాశం వచ్చినపుడు తమకిచ్చిన సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఒక్కో సమస్యను దేశమంతా ప్రతిధ్వనించేలా చాటిచెప్పాలి. కానీ అలా జరగలేదు. అందరిదీ అదే పాత రికార్డు. చ‌ర్చను ప్రారంభించిన గల్లా జ‌య‌దేవ్  గంట‌సేపు రోజూ టీడీపీ నేతలు చెప్పే మాటలే మరోసారి చెప్పారు. రాష్ర్టానికి జ‌రిగిన అన్యాయాన్ని ఏక‌రువు పెట్టారు. గడగడా చదువుతూ పోయారు తప్ప ఎక్కడా ఎమోషనల్ కనెక్షన్ లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంగిలి మెతుకులు విసిరింద‌ని, వివ‌క్ష చూపిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను మోస‌గిస్తే కాంగ్రెస్‌ మాదిరిగానే నామ‌రూపాల్లేకుండా పోతుంద‌ని శాపనార్థాలు పెట్టారు. అంకెలు వల్లెవేసి అదీ ఇదీ అని రంకెలు పెట్టారు తప్ప ఇదీ పరిస్థితి అని వివరించలేకపోయారు. సభాముఖంగా రాష్ట్రం తరఫున దేశప్రజలందరి భావోద్వేగాలను కూడగట్టడంలో ఫెయిలయ్యారు. తద్వారా జాతీయ స్థాయిలో ఇష్యూ చేసే అవకాశాన్ని జారవిడిచారు. చివరికి ఏదో అనుకుంటే ఏదో అయిందని ముఖాలు వేలాడేసుకొని వెనక్కి తిరిగి వచ్చారు.