యూ టర్న్ తీసుకున్నది మోడీనే

యూ టర్న్ తీసుకున్నది మోడీనే

యూ టర్న్ తీసుకున్నది మేము కాదు మీరేనని మోడీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మించుకోవచ్చని ప్రజల్ని నమ్మించి ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారన విమర్శించారు. ఢిల్లీలో చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన... తిరుపతిలో వెంకటేశ్వరుని సాక్షిగా ఇచ్చిన హామీని మరిచిపోయారని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను మాత్రమే నెరవేర్చాలని ప్రధానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉందని తెలుసు.. అయినా తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని బాబు గుర్తుచేశారు.  అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 15 ఏళ్ల తర్వాత తామే అవిశ్వాసం పెట్టామని చెప్పారు. మెజారిటీకి, నైతికతకు మధ్య జరుగుతోన్న పోరాటమిదని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

నాలుగేళ్లు చూశాక.. ఓపిక నశించి కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం అవాస్తవమని చెప్పారు. రాష్ట్ర విభజనతో నష్టపోయామని.. ఆదుకోమని అడిగితే మాపైనే విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవ్వరికీ ప్రత్యేక హోదా లేదన్నారని.. కానీ ఇప్పటికీ 11 రాష్ట్రాలకు రాయితీలు ఇస్తున్నారని గుర్తుచేశారు చంద్రబాబు.

వైసీపీ ట్రాప్‌లో పడ్డారని ప్రధాని నిన్న అన్నారు. నేను ఎప్పటికీ తప్పు చేయను. తెలంగాణతో మేం తగాదాలు పెట్టుకున్నామని మోడీ అన్నారు. కేసీఆర్‌ మెచ్యూరిటీగా వ్యవహరించారని నన్ను విమర్శించారు. అవినీతి పార్టీతో లాలూచీ పడ్డామని మాపై విమర్శలు చేశారు. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు కోర్టులో ఉంటే.. మా ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అవినీతిని అంతమొందిస్తామని చెప్పే మోదీ.. గాలి జనార్దన్‌రెడ్డి వర్గానికి టికెట్‌ ఎలా ఇచ్చారని నిలదీశారు.