అనంతపురంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఇసుక దుమారం...!

అనంతపురంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఇసుక దుమారం...!

నేతల మధ్య విమర్శలు.. ఆరోపణలు చూస్తుంటే ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉంటాయి. విన్నవారికి  అవి నిజమేనేమో అన్నంత భ్రమ కలిగిస్తాయి. ఆ జిల్లాలోని నాయకులు మధ్య అదే జరుగుతోంది. కాకపోతే అవి ఉత్తి ఆరోపణలు.. ఉత్తుత్తి ఖండనలు. 

ఇసుక దుమారంపై నేతల మధ్య మాటల మంటలు!

అనంతపురం జిల్లాలో పొలిటికల్‌గా కాస్త కూల్‌గా ఉండే నియోజకవర్గాలుగా రాయదుర్గం, కళ్యాణదుర్గాలకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయింది. జిల్లాలో జరిగే రాజకీయ రగడకు ఈ రెండు నియోజకవర్గాలే కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్‌కు చేరుకుంటోంది. అయితే నిజంగానే  ఆరోపణలు చేసుకుంటున్నారా.. లేక ఉత్తుత్తి  విమర్శలతో తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియడం లేదట. తాజాగా ఇసుక దుమారంపై చేలరేగుతున్న మాటల మంటలపై ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. 

ఎమ్మెల్యేలు లక్ష్యంగా టీడీపీ ఆరోపణలు!

రాయదుర్గంలో ఇసుక నిల్వలు ఎక్కువ. ఇక్కడి నుంచి బెంగళూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తారన్నది బహిరంగ రహస్యం. అక్రమంగా ఇసుక తరలిస్తూ వాహనాలు పోలీసులకు దొరికితే అవి వైసీపీవారికి చెందినవే అన్నది టీడీపీ ఆరోపణ. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులే మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసురుతుంటారు. కల్యాణదుర్గంలోనూ ఇదే తరహా ఇసుక రాజకీయం నడుస్తోంది. వైసీపీ నేతలు బరి తెగించి ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్‌. రాయదుర్గం ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి, కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ ఉన్నారు. వీరిద్దరి లక్ష్యంగానే టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

ఉత్తుత్తి బాణాలు వేస్తున్నారా? 

ఈ మాటల యుద్ధంలో వెనకపడితే పొలిటికల్‌గా డ్యామేజీ అవుతుందని భావిస్తున్నారో ఏమో.. నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదు. సవాళ్లు విసురుకుంటూ ఏదో అయిపోతుందన్నట్టుగా హడావిడి చేస్తున్నారట. కానీ ఏదీ తేలదు. ఆ విషయం జనాలకంటే వారికే బాగా తెలుసు. అందుకే ఉత్తుత్తి బాణాలు గాలిలో విసురుతూ తేల్చేస్తాం అన్నట్టు మాటలు వదిలేస్తున్నారు. వాస్తవానికి ఇసుక అక్రమ రవాణాపై సిట్‌ కేసు నమోదైంది.

నేతల మధ్యే ఇసుక దుమారం!

ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నది రెండు పార్టీల నేతలు చెప్పే మాట. ఆధారాలు చూపించడానికి ఆరోపణలు చేసినవారు ముందుకు రారు. ఇది తెలిసి దమ్ముంటే నిరూపించాలని కోరతారు అధికార పార్టీ నాయకులు. అంతకుమించి ఈ దుమారం ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. కాకపోతే శ్రుతిమించి వాగ్బాణాలు సంధించుకోవడంలో ఆరితేరిపోయారు ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులు. దీంతో ఏదైనా రాజకీయ నేతలకే సాధ్యమని చెవులు కొరుక్కుంటున్నారు జనం.