సీఎం కొడుకు నుండి సీఎం జగన్...ఇదీ జగన్ ప్రస్థానం

సీఎం కొడుకు నుండి సీఎం జగన్...ఇదీ జగన్ ప్రస్థానం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన జగన్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సొంత పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా నుంచే జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తండ్రి సీఎంగా ఉండగానే తొలిసారిగా 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు జగన్.

అయితే గెలిచిన కొన్ని నెలలకే తండ్రి ఆకస్మిక మరణంతో చాలా మంది మరణించగా వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించేందుకు సిద్ధం అయ్యారు జగన్. అయితే, కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతించలేదని కారణంతో 29 నవంబర్ 2010లో ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తన సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిపై 5,45,043 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అనంతరం 2011 మార్చి 11న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పేరుతో ఒక నూతన రాజకీయ పార్టీని తీసుకొచ్చారు. అయితే ఆయన కోసం అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆయన వెంట నడిచారు, అలా 2012 ఉప ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ విజయఢంకా మోగించింది. ఆ ఏడాది 19 శాసన సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 17 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండింటిలోనూ గెలిచారు.

యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలిపిన సమయంలో వైసీపీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. రాష్ట్రంలో బలమైన తెలుగుదేశం కూడా రెండు నాల్కల ధోరణి ప్రదర్శించినా ఏదేమైనా సరే అంటూ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్ ఉద్యమించారు. సమైక్యాంధ్ర కోసం అనేక రకాలుగా పోరాడారు. ఎన్నికైన పార్టీ నేతలతో రాజీనామాలు చేయించారు. ఆమరణ నిరహార దీక్ష చేశారు. అయితే అవేవీ కలిసి రాలేదు.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వైసీపీ పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి 175 స్థానాలకుగాను 106 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఒంటరిగా బరిలోకి దిగిన వైసీపీ 67 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తెలంగాణలో ఆ పార్టీ 3 శాసన సభ, ఒక పార్లమెంట్ స్థానంలో గెలిచింది. తర్వాత కాలంలో వారందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అప్పటి నుంచి తెలంగాణలో వైసీపీ ఉనికి కోల్పోయి 2018 ఎన్నికల నాటికి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు తగిన వ్యూహాలను అమలు చేసేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను జగన్ వినియోగించుకుటున్నారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ చరిత్రలో ఎవరూ సాధించలేని రీతిలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. 151 స్థానాల్లో గెలుపొందిన వైయస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది.

ఓ ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగన్ అనితర సాధ్యమైన పట్టుదలతో ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు అద్భుతం. 2010 కలి ముందు జగన్ పెద్దగా పాపులర్ కాదు. తండ్రి మరణం తర్వాత ఆయన వార్తల్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం.. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిరావడం.. ఈ ఘటనలతో ఆయన తరచుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. 2017 నవంబర్ 6న ప్రారంభమైన ఈ యాత్ర 2019 జనవరి 9న ముగిసింది. తన యాత్రలో భాగంగా దాదాపు 3000 కిలోమీటర్లు జగన్ పర్యటించారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలకు గాను 151 స్థానాలను వైసీపీ గెల్చుకుంది. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఆయన తన జీవితంలో 16 నెలలు జైలు జీవితం గడిపారు. అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగం కింద 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు కూడా ఆయన బెయిల్ మీదనే ఉన్నారు.

ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విషయాన్ని తన తండ్రి నుండి నేర్చుకున్నట్టున్నారు జగన్‌. హైదరాబాద్ దిశ ఘటన తర్వాత జగన్ నేతృత్వంలొని ఏపీ క్యాబినెట్ 15 రోజుల్లోనే ఏపీ కేబినెట్ దిశ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లు ఆమోదం పొంది తద్వారా జగన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.