గన్నవరంలో ఆ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారా? అయన వివాదానికి కారణమేంటి?

గన్నవరంలో ఆ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారా? అయన వివాదానికి కారణమేంటి?

ఆ ఎమ్మెల్యే తీరు కాస్త డిఫరెంట్‌. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. కొన్ని వివాదాలు.. మరికొందరితో విభేదాలు కొనితెచ్చుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి మంచి ఫలితాలు సాధించిపెట్టలేకపోయారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై సొంతపార్టీవారే భగ్గుమంటున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ? ఆయన వివాదాస్పదం కావడానికి కారణాలేంటి ?

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేపై ఆగ్రహంతో పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేసి బహిరంగంగా విమర్శలు చేశారు. దీనికితోడు ఇక్కడ పార్టీకి పెద్దలుగా ఉండే నాయకులతో ఎమ్మెల్యేకు వర్గపోరు క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం అధిష్టానం వద్ద ఫిర్యాదు వరకూ వెళ్లింది. దీంతో గన్నవరం వై.సి.పి.లో ఏం జరగబోతోంది అనేది పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కొండేటి చిట్టిబాబు.. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే కుమారుడి పుట్టినరోజు వేడుకలు రద్దీగా ఉండే అంబాజీపేట జంక్షన్ లో చేయటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి విమర్సలు వచ్చాయి. ఆ తర్వాత కొందరు మంత్రులు నియోజకవర్గానికి దుష్టశక్తులుగా మారారంటూ చిట్టిబాబు చేసిన కామెంట్స్‌ కలకలం రేపాయి. మరోసారి మామిడికుదురు మండలంలో మహిళా వాలంటీర్ ను ఎమ్మెల్యే బహిరంగా తిట్టడంతో..ఆమె ఆత్మహత్యాయత్నం చేసే వరకూ వివాదం వెళ్లింది.

ఇటీవల అంబాజీపేట మండలం గంగలకుర్రులో సి.సి. రోడ్డు పనులు సగంలో నిలిచిపోవటంతో.. స్థానిక వై.సి.పి. నాయకులు పార్టీకి రాజీనామా చేసే వరకూ వ్యవహారం వెళ్లింది. తాము ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా ఆయన పట్టించుకోలేదనీ.. తాము అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా పరిస్థితి మారిందనీ స్థానిక నాయకులు కరపత్రం వేసి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా ఆశించినమేరకు రాకపోవడంతో.. ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. నియోజవర్గంలో 68 పంచాయతీలకు దాదాపు సగం మాత్రమే వై.సి.పి.కి దక్కాయి. 36 అధికార వై.సి.పి.కి వస్తే... 22 పంచాయతీలు టి.డి.పి, జనసేన పార్టీలకు వచ్చాయి. ఎమ్మెల్యే సొంత గ్రామంలో సైతం వై.సి.పి.కి ఓటమి ఎదురైంది.

ఒకవైపు పంచాయతీ ఎన్నికల్లో ఆశించినమేరకు ఫలితాలు రాకపోగా.. ఇతర వైసీపీ నేతలతో ఎమ్మెల్యేకు ఉన్న వర్గపోరు తీవ్రమవుతోంది.  ఇటీవల నియోజకవర్గంలో ఓ ముఖ్యనేత అట్టహాసంగా నిర్వహించిన మున్సిపల్ ఛైర్మన్ల సన్మాన కార్యక్రమానికి చిట్టిబాబు హాజరు కాలేదు. ఇలా  రెండేళ్లు కాకుండానే ఓవైపు వివాదాలు...మరోవైపు విభేదాల్లో ఎమ్మెల్యే చిక్కుకున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

టైమ్‌ బాగాలేక ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతుంటే.. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటకే పి.గన్నవరం జెడ్.పి.టి.సి అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేణుగోపాల్...  ఛైర్మన్ అవుతారానీ... తద్వారా నియోజకవర్గంలో పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటారనీ కార్యకర్తలు అనుకుంటున్నారు. గత టి.డి.పి. ప్రభుత్వ హయాంలో అప్పటి పి.గన్నవరం ఎమ్మెల్యే నారాయణమూర్తి ఇదే తరహాలో వివాదాల్లో చిక్కుకున్నప్పుడు.. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు ఇక్కడి వ్యవహారాలు చూసేవారు. దీంతో పాత సీన్ మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అయితే వివాదాల సంగతి ఎలా ఉన్నా.. అభివృద్ధి విషయంలో ఆయన తన పని తాను చేసుకుని వెళ్తున్నారనీ చిట్టిబాబు వర్గీయులు చెబుతున్నారు.