మాజీ ఎంపీ పొంగులేటి ఎత్తుగడ వర్కవుట్‌ అవుతుందా?

మాజీ ఎంపీ పొంగులేటి ఎత్తుగడ వర్కవుట్‌ అవుతుందా?

ఆ మాజీ ఎంపీ రాజకీయంగా డిసైడ్‌ అయ్యారా? మాటల దాడి చేయడం ద్వారా తన వర్గాన్ని కాపాడుకునే పనిని మొదలు పెట్టారా? ఇకపై దూకుడుగా ఉంటానని సొంత పార్టీలోని ప్రత్యర్థులకు సంకేతాలు పంపారా? ఇంతకీ ఆయన ఎత్తుగడ వర్కవుట్‌ అవుతుందా? ఎవరా మాజీ ఎంపీ? 

ఖమ్మంలో తిరగాలంటే పాస్‌పోర్టు కావాలా? 

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొంతకాలంగా జిల్లా గ్రూప్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక నేత మరోక నేతపై పైచేయి సాధించే పనిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గళం విప్పారు. తన వర్గం నేతలను ఇబ్బందులు పెడుతుండడంతో ...మొదటిసారిగా ప్రత్యర్థులపై ఆయన  ఫైర్ అయ్యారు. ఇకపై చూస్తూ ఊరుకుంటే.. తమ వెంట నడుస్తున్న కార్యకర్తలు ఆత్మస్థైరం కోల్పోతారన్న ఆలోచనకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఖమ్మంలో తిరగాలంటే పాస్‌పోర్ట్ కావాలా అని తన ప్రత్యర్ధులను ప్రశ్నించడం ద్వారా ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమయ్యారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

పొంగులేటి వర్గాన్ని ఇబ్బందిపెడుతోన్న ఎమ్మెల్యేలు? 

టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేలే నియెజకవర్గానికి సుప్రీం. పార్టీ అంతర్గత సమావేశాల్లో పలుమార్లు కేసిఆర్ నేతలకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాజాగా ఖమ్మం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండడంతో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులను ఆయా నియెజకవర్గాలలోని ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారట. సత్తుపల్లిలోనూ అటువంటి పరిస్థితి ఉండడంతో అక్కడికి పర్యటనకు వెళ్లిన ఆయన.. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదన్నారు. కక్షపూరిత రాజకీయాలు వద్దని పరోక్షంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు స్పష్టం చేశారు మాజీ ఎంపీ. కష్టపెట్టిన వారు వడ్డీతో సహ అనుభవించాల్సి ఉంటుందని ఒక అడుగు ముందుకు వేసి హెచ్చరించారాయన. 

ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారా? 

దుకూడుగా ఉండేందుకు పొంగులేటి డిసైడ్ అయ్యారా అనే చర్చ మొదలైంది. ప్రత్యర్ధులను గట్టిగా హెచ్చరించడం ద్వారా ఇకపై ఊరుకోబోనన్న సంకేతాలు పంపారేమోనని కొందరు భావిస్తున్నారు. తన మనసులో మాట బయటపెట్టారని అభిప్రాయపడేవారు కూడా ఉన్నారు. త్వరలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగుతాయి. వర్గ విభేదాలు కొనసాగితే కార్పొరేషన్ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. 

పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా?

పార్టీ మారేందుకు సిద్ధమైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. స్వరం పెంచారనే  ప్రచారం కూడా జరుగుతోంది. అయితే పార్టీ మారే అలోచనలో లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి.. ఈ అంశంపై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టి.. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా..లేదా అన్నది చూడాలి.