జీహెచ్ఎంసీలో ప్రజల గోడు పట్టించుకునేదెవరు...?

జీహెచ్ఎంసీలో ప్రజల గోడు పట్టించుకునేదెవరు...?

కోటి మందికిపైగా జనాభా ఉన్న నగరం హైదరాబాద్‌. ఇంత పెద్ద సిటీలో ఏదోఒక మూల.. ఏదో ఒక బస్తీలో సమస్యలు సహజం. కరోనా ముందు వరకు ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఒక ఏర్పాటు చేశారు. కరోనా వచ్చాక ఆ ఏర్పాటు అటకెక్కింది. ఇప్పుడు అన్‌లాక్‌లపై అన్‌లాక్‌లు వస్తున్నా పాత పద్ధతిపై నోరు మెదపడం లేదు బల్దియా అధికారులు. ఇంతకీ వాళ్లకు ఏమైంది? అలాంటి వ్యవస్థ ఒకటి ఉందని వారికి గుర్తుందా? 

అప్పట్లో ప్రజలకు రోజూ 2 గంటల సమయం ఇచ్చేవారు అధికారులు!

GHMC పరిధిలో  ఆరు జోన్లు.. 30 సర్కిళ్లు ఉన్నాయి.  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నివసించే వారిని దృష్టిలో పెట్టుకుని పనులు చేపడతారు బల్దియా అధికారులు. ప్రజలకు, వ్యాపారులకు అవసరమైన సర్టిఫికెట్ల జారీకి.. పనుల పర్యవేక్షణకు పక్కాగా వ్యవస్థ ఉంది. ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఒకవేళ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే.. వాటికి క్షేత్రస్థాయిలో పరిష్కారం లభించకపోతే.. ఆయా విభాగాల ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసే వ్యవస్థ కూడా ఉంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అధికారులను ఇబ్బంది పెట్టకుండా  ప్రతి రోజూ 2 గంటల సమయం విజిటర్స్‌ కోసం కేటాయించేవారు. అది ఒకప్పటి మాట. కరోనా తర్వాత ఆ సమయాన్ని అటకెక్కించేశారు. 

కరోనా ప్రభావం తగ్గినా 2 గంటలు కేటాయించరు!

ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇన్నాళ్లూ సమస్యలతో ఎదురైన ఇబ్బందులను పంటి బిగువున భరించిన ప్రజలు.. GHMC అధికారులవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కరుణిస్తారు? ఎప్పుడు తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందా అని GHMC చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ.. కరోనా ముందు ఉన్న రోజుకు 2 గంటల సమయం మాత్రం పునరుద్ధరించడం లేదు. చాలా అన్‌లాక్‌లు వచ్చాయి.  కోవిడ్‌ కట్టడి ఒకప్పటి మాట. ఇప్పుడు కోవిడ్‌ రక్షణ చర్యలు తీసుకుంటూ చాలా ప్రభుత్వ విభాగాలలో పనులు చేపడుతున్నారు. GHMC లో మాత్రం ఆ ఊసే లేదు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అడిషనల్‌ కమిషనర్లు పత్తా లేకుండా పోతున్నారట. 

చొరవ తీసుకునే వారే బల్దియాలో కరువయ్యారా? 

కరోనా సమయంలోనే GHMC ఎన్నికలు జరిగాయి.  వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయినా రెండు గంటలు ప్రజల కోసం కేటాయించలేకపోతున్నారు. విజిటింగ్‌ అవర్స్‌ పునరుద్ధరించాలని  ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నా.. ఆ దిశాగా చొరవ తీసుకునే వారే బల్దియాలో కరువయ్యారట. 

తప్పించుకుని తిరుగువారు ధన్యులేనా?

ప్రజల సంగతి పక్కన పెడితే.. మీడియాను కలవడానికి కూడా అధికారులు నో కరోనా టైమ్‌ అని వారిస్తున్నారు. కొందరైతే బిజీగా ఉన్నాం అని తప్పించుకుంటున్నారు. పైగా GHMC పాత పాలకవర్గం సమయం ముగుస్తోంది. కొత్త పాలకవర్గం 11న కొలువు దీరబోతోంది. మరి.. అప్పటి వరకు కాలయాపన చేద్దామని అనుకుంటున్నారో.. లేక  తప్పించుకు తిరుగువాడ ధన్యుడు సుమతి అని చాటుతున్నారో కానీ.. ప్రజల గోడు పట్టించుకునే ఉన్నతాధికారులు GHMCలో కనిపించడం లేదట. మరి.. ఎన్ని రోజులు అధికారులు ఈ దాగుడు మూతలు ఆడతారో చూడాలి.