హిందూపురం టీడీపీ నాయకుల మధ్య ఐక్యత లేదా?

హిందూపురం టీడీపీ నాయకుల మధ్య ఐక్యత లేదా?

ఆయనో మాజీ ఎమ్మెల్యే. టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. సమన్వయం చేసుకోలేకపోతున్నారో ఏమో నేతలు తలోదారిలో వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సోలో సాంగ్‌లే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? 

పార్టీ కమిటీల ప్రకటనతో ఊపు తెచ్చే యత్నం!

అనంతపురంజిల్లాలోని హిందూపురం లోక్‌సభ పరిధిలో టీడీపీ ఒకప్పుడు బలంగా ఉండేది. గత ఎన్నికల్లో అంతా రివర్స్‌. లోక్‌సభ పరిధిలో హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఒక్కరే గెలిచారు. మిగతాచోట్ల టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా.. ఇటీవల పార్టీ కమిటీలను ప్రకటించి కొత్త ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ. గతంలో అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే BK పార్థసారథికి హిందూపురం పార్లమెంట్‌ పార్టీ ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు.  

టీడీపీలో ఐక్యతా రాగం మిస్‌

ఒకప్పుడు జిల్లా టీడీపీకే  పార్థసారథి సారథ్యం వహించడంతో హిందూపురం పెద్ద లెక్క కాదని భావించాయి పార్టీ వర్గాలు. కానీ.. అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటీ అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదో లేక నాయకులు ఒక్కతాటిపైకి రాలేకపోతున్నారో కానీ.. హిందూపురం పరిధిలో టీడీపీ ఐక్యతా రాగం మిస్‌ అయింది. అంతా సోలో సాంగే వినిపిస్తోందట. 

హిందూపురంలో టీడీపీ ప్రోగ్రామ్‌కు రాని నేతలు!

ఇటీవల రైతుల కోసం పెనుకొండలో ర్యాలీని చేపట్టారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల ఇంఛార్జిలు పాల్గొన్నారు. జేసీ పవన్ కుమార్ రెడ్డి, పరిటాల శ్రీరాం వంటి నేతలు కూడా ఒకే వేదిక పై కనిపించారు. అదే కార్యక్రమాన్ని హిందూపురం పార్లమెంట్‌లో నిర్వహిస్తే.. అట్టర్ ప్లాప్ అయిందని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. పక్క పార్లమెంట్ నియోజకవర్గాల నేతల సంగతి పక్కన పెడితే.. కనీసం హిందూపురం పార్లమెంట్ పరిధిలోని నేతలు కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. కదిరి, కందికుంట, ధర్మవరం, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి.. ఇలా ఎవరూ రాలేదట. 

సమాచారం ఇచ్చినా పార్టీ నేతలు రాలేదా? 

నేతలకు ఇష్టం లేక పాల్గొనలేదా.. లేక మరే ఇతర పనుల్లో బిజీగా ఉండి రాలేదా అన్నది అర్థం కాని పరిస్థితి. పార్థసారథి అందరినీ సమన్వయం చేసుకోలేదేమోనని అంతా అనుకుంటున్నారట. అసలు ఆయన అందరికీ సమాచారం ఇచ్చారా? సమాచారం ఇచ్చి ఉంటే టీడీపీ నాయకులు ఎందుకు రాలేదు? పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవి.. ప్రజల్లోకి వెళ్లే ఇలాంటి కార్యక్రమాలపై ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీకి కంచుకోటగా భావించే ప్రాంతాల్లోనే ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు? 

పెద్ద జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన పార్థసారథి ఇలా ఒక పార్లమెంట్‌ పరిధికి పరిమితం కావడం ఇష్టం లేదా? మొక్కుబడిగానే పార్టీ కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. మరి.. ఆ లోగుట్టు ఏంటన్నది ఇక్కడి తెలుగు తమ్ముళ్లకే తెలియాలి.