పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల సెగ ఢిల్లీ బీజేపీ నేతలను తాకిందా...?

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల సెగ ఢిల్లీ బీజేపీ నేతలను తాకిందా...?

పవన్‌ కల్యాణ్‌ అలా అన్నారో లేదో.. సోము వీర్రాజు హైదరాబాద్‌లో ఇలా వాలిపోయారు. రెండు పార్టీల మధ్య వచ్చిన గ్యాప్‌ పూడ్చాలనుకున్నారో లేక.. ఢిల్లీ పెద్దలు తలంటితే వచ్చారో కానీ సర్దుబాటుకు ప్రయత్నించారనే చర్చ మొదలైంది. మరి.. మిత్రపక్షాల మధ్య వచ్చింది మిత్రభేదమా? కలహమా? తాజా భేటీతో కలిసిపోయినట్టేనా? కలిసి అడుగులు వేస్తారా? బీజేపీ-జనసేన మధ్య అసలేం జరుగుతోంది?

పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌ సెగ ఢిల్లీ బీజేపీ నేతలకు తాకిందా?

ఏపీలో బీజేపీ-జనసేన మధ్య గ్యాప్‌ వచ్చిందా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారా?  పవన్‌ కల్యాణ్‌ను ఏపీ బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదా? తిరుపతిలో జనసేన నిర్వహించిన సమావేశాల్లో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల తర్వాత రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివే. అసలు రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది అని ఆరా తీస్తున్నారు మరికొందరు. అయితే తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యల సెగ ఏపీలోని బీజేపీ నాయకుల కంటే.. ఢిల్లీలో ఉన్న కమలనాథులకు బలంగా తాకినట్టు సమాచారం. దీంతో అక్కడ నుంచే ఏపీ బీజేపీ నేతలకు తలంటినట్టు కాషాయపార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు  ఆగమేఘాలపై హైదరాబాద్‌ వచ్చి పవన్‌ కల్యాణ్‌తో సమావేశయ్యారు. ఈ భేటీ ముగిసిన మరుసటి రోజే ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌, కేంద్రమంత్రి మురళీధరన్‌, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పురందేశ్వరి సైతం హైదరాబాద్‌ వచ్చి పవన్‌ కల్యాణ్‌ నివాసంలో జనసేనానితో భేటీ అయ్యారు. ఈ సమవేశంలో సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు. 

ఏపీ బీజేపీ నేతల పోరాటంపై పవన్‌ అనుమానాలు?

తిరుపతి లోకసభకు జరగబోయే ఉపఎన్నికల్లో మిత్రపక్షాలలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై బీజేపీ-జనసేన మధ్య గ్యాప్‌ వచ్చింది. పోటీకి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. తిరుపతిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని వీర్రాజు ప్రకటన చేశారు.  ఈ ప్రకటనను జనసేన నాయకులు ఓపెన్‌గానే తప్పుపట్టారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో పవన్‌ మాట్లాడినప్పుడు ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారని నిర్ణయం తీసుకుంటే.. దానిని భిన్నంగా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు జనసైనికులు. అప్పటి నుంచి గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి.. పవన్‌కల్యాణ్‌ కామెంట్స్‌ రూపంలో మరోసారి బయటపడింది. ఢిల్లీ బీజేపీ నేతలు తమతో బాగానే ఉంటోన్నా.. ఏపీ బీజేపీ నేతలతో గ్యాప్‌ ఉందని.. చిన్న చూపు చూస్తున్నారని బాంబు పేల్చారు పవన్‌. అంతేకాదు.. GHMC ఎన్నికల్లో ఫైట్‌ చేసినట్టు తిరుపతి లోక్‌సభ బైఎలక్షన్‌లో బీజేపీ నాయకులు పోరాటం చేస్తారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

బీజేపీ, జనసేన ప్రకటనల్లోనూ పొంతన లేదు!

మిత్రపక్షాల మధ్య ఏదైనా పొరపచ్చాలు ఉంటే..  ఆయా పార్టీల నేతలు కలిసి చర్చించుకుంటారు. ఈ ఎపిసోడ్‌లో బీజేపీ-జనసేన మధ్య అలాంటి చర్చలు జగినట్టు కనిపించడం లేదు. దాంతో జనసేనాని బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారని అనుకుంటున్నారు. ఆదివారం నాటి పవన్‌ కల్యాణ్, సోము వీర్రాజు భేటీ తర్వాత రెండు పార్టీలు వేర్వేరుగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనల్లోనూ ఆ వ్యత్యాసం కనిపించింది. తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థిపై చర్చించామని బీజేపీ చెబితే.. ఎక్కడైనా చిన్నపాటి గ్యాప్స్‌ ఉన్నా ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని చక్కదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు అని జనసేన ప్రకటనలో ఉంది. అంటే దాల్‌మే కుచ్‌ కాలాహై అన్న ప్రశ్నలు నిజమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

పొత్తు పెట్టుకున్నాక కలిసి పోరాటం చేసింది లేదు!

ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. ఆలయాల్లో జరుగుతున్న గొడవలపై బీజేపీ పెద్దఎత్తున ఉద్యమిస్తోంది. అంతకుముందు రైతుల విషయంలో జనసేన పోరాటం చేసింది. ఈ రెండు అంశాలలో బీజేపీ-జనసేన కలిసి పోరాటం చేసింది లేదు. ఎవరిదారి వారిదే. పొత్తు పెట్టుకున్నాక కలిసి చేపట్టిన ఉద్యమం కూడా లేదు. దీనిపై జనసేనలోనూ చర్చ జరుగుతోందట. ఇప్పుడు తిరుపతిలో పవన్‌ వ్యాఖ్యలతో అది బయటపడిపోయింది. ఢిల్లీ స్థాయిలో ఆ సెగ తాకింది. జనసేనానిని తమ దగ్గరకు పిలవడం కాదు.. కమలనాథులే  హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌ ఇంట్లో వాలిపోయారు. మరి.. ఈ సమావేశంలో గ్యాప్‌ పూడ్చుకుంటారో లేదో చూడాలి.