అజ్ఞాతంలో జేసీ దివాకర్ రెడ్డి.. ఏం చేస్తున్నారో తెలుసా?

అజ్ఞాతంలో జేసీ దివాకర్ రెడ్డి.. ఏం చేస్తున్నారో తెలుసా?

రాజకీయాల్లో ఆయన డిఫరెంట్‌. స్వపక్షమైనా విపక్షమైనా ముక్కు సూటిగా.. ఘాటుగా మాట్లాడతారు. అలాంటి నాయకుడికి ఒకే ఒక్క ఓటమి.. వైరాగ్యాన్ని తీసుకొచ్చింది. తన ఫ్యామిలీ మీద వచ్చిన వరుస కేసులతో కాస్త దూకుడు తగ్గించారు. నోటిని కట్టేసుకున్నారు. ఒకరకంగా అజ్ఞాతంలో ఉన్నారు. మరి.. అజ్ఞాతవాసంలో ఆయనేం చేస్తున్నారు? ఎవరా నాయకుడు? 
 
మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఊహించని షాక్‌!

జేసీ దివాకర్ రెడ్డి. పెద్దగా పరిచయం అవసరం లేని పొలిటీషియన్‌. ఎప్పుడో వైఎస్, చంద్రబాబు బ్యాచ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. తాడిపత్రి కేంద్రంగా మూడున్నర దశాబ్దాలుగా మకుటం లేని మహారాజులా ఉన్నారు. ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డిది కూడా అన్న స్టయిలే. నిత్యం ఏదో ఒక కామెంట్‌ చేస్తూ వార్తల్లో ఉండేవారు జేసీ బ్రదర్స్‌. కనుసైగతో రాజకీయాలను శాసించిన వీరికి మొన్నటి ఎన్నికల్లో  ఓటమి ఊహించని షాక్‌ ఇచ్చింది. 
 
తమ్ముడిని జైలుకు పంపిన తర్వాత కనిపించడమే మానేసిన  జేసీ!

కంచుకోటలాంటి తాడిపత్రి.. తమ రాజకీయ ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత జేసీ ట్రావెల్స్‌పై కేసులు.. పోలీసులను దూషించిన కేసులు.. ఒకటేమిటి ఒకదాని వెనక మరొకటిగా కేసులే కేసులు. ప్రభాకర్‌రెడ్డి అయితే రెండు కేసుల్లో జైలుకు వెళ్లారు. మొన్నటి ఎన్నికల్లో ఓడినా జేసీ దివాకర్‌రెడ్డి యధావిధిగా తనదైన స్లయిల్లో సెటైర్లు.. విమర్శలు చేశారు. కానీ.. ప్రభాకర్‌రెడ్డిని జైలుకు పంపడంతో పెద్ద JC పిన్‌డ్రాప్‌ సైలెంట్‌ అయిపోయారు.  మాట సంగతి దేవుడెరుగు..  కంటికి కనిపించడమే మానేశారు. మరి.. పెద్దాయన ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అని ఆరా తీసిన వారికి  తాడిపత్రిలో ఇలా కనిపిస్తున్నారు.
 
జేసీని కలవాలంటే పొలానికి రావాల్సిందే!

తమ వ్యవసాయ క్షేత్రంలో హాయిగా సేద తీరుతున్నారు జేసీ. తమ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నారు. దివాకర్‌రెడ్డిని కలవాలని అనుకున్నవారు ఎవరైనా ఉంటే.. ఇలా పొలానికి వచ్చి కలవాల్సిందేనట. ఒకవేళ తాడిపత్రిలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే మాత్రం వ్యవసాయ క్షేత్రం నుంచి బయటకు వచ్చి వెళ్లి పరామర్శిస్తున్నారట జేసీ.  
 
విమర్శలకు స్వస్తి చెప్పి.. పొలంలో కలుపు తీసుకుంటున్నారు!

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం టీడీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఎవరేం మాట్లాడినా రియాక్షన్‌ వేగంగా ఉంటోంది. జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఏం జరిగిందో చూశారు. అందుకే మొండిగా పోయి అధికార పక్షాన్ని విమర్శించి సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో ఇలా భూమి తల్లిని నమ్ముకుని చేలో కలుపులు తీసుకుంటున్నారట.  అయితే గతంలోనే జేసీ దివాకర్‌రెడ్డి చాలా స్పష్టంగా ఓ విషయం చెప్పారు. తమను ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారు? మహా అయితే జైలుకు పంపుతారు. లేదా ఆస్తులమీద దాడులు చేయిస్తారు. అంతేకదా.. ఎన్ని చేసినా నేను మా పొలంలో ఉండి సాధారణ జీవితం గడుపుతా అని చెప్పారు. ఆయన ఆనాడు అన్నట్టుగానే.. ఆ టైమ్‌ కూడా JCకి వచ్చేసిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 
 
రెడ్ కార్పెట్‌ స్వాగతాలు లేవు.. కళ్లకు కూలింగ్‌ గ్లాస్‌లు లేవు!

మొత్తంమీద మూడున్నర దశాబ్దాలు తిరుగులేని నాయకుడిగా.. ఎక్కడికి వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకుని.. కూలింగ్ గ్లాస్‌లు, కోట్లు విలువ చేసే కార్లలో ప్రయాణం చేసిన జేసీకి చివరకు ఇలా వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అయ్యారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది పాత సామెత.. ఇప్పుడు సర్కార్‌ తలచుకుంటే  ఇదేగతి పడుతుందని జేసీని చూసిన వారు కామెంట్స్‌ చేస్తున్నారట.