నోరు జారి.. నాలుక కరుచుకుంటోన్న యువ శాసనసభ్యుడు!

నోరు జారి.. నాలుక కరుచుకుంటోన్న యువ శాసనసభ్యుడు!

ఆయనో యువ ఎమ్మెల్యే. రాజకీయాలకు పాతే కానీ అధికారానికి కొత్త. ఆ ఎఫెక్టో ఏమో నోరు జారడం.. నాలుక కరుచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఇటీవల తనపై వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలను బహిరంగంగానే ఒప్పేసుకుని..సొంత పార్టీ నేతలను ఇరుకున పెట్టేశారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథ? 

భూ ఆక్రమణ వివాదంలో ఎమ్మెల్యే అదీప్‌రాజు!

విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది.  ఎమ్మెల్యే కుటుంబం భూ ఆక్రమణల పేరుతో అస్త్రం సంధించిన టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తి.. ఇవిగో ఆధారాలు అంటూ డ్రోన్ వీడియోలను బయట పెట్టారు. ఆ విధంగా చర్చల్లోకి వచ్చారు అదీప్‌రాజు. 

ఎవరు అడగని సమాచారం లీక్‌చేసిన అదీప్‌రాజు!

పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కుటుంబానికి కరుణ ఆక్వా పరిశ్రమ ఉంది. సర్వే నెంబరు 464లో 6 ఎకరాల కొండ పోరంబోకును ఆక్రమించి కరుణ ఆక్వా సంస్ధ నిర్మాణాలు  చేపట్టిందట. ఈ వ్యవహారాన్ని టీడీపీ ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది. టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టాలని.. ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యత తీసుకోవాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌కు చెప్పారట. ఆ మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. విమర్శలను ఎదుర్కొనే క్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజు అసలు గుట్టు బయటపెట్టేశారు. ఎవరు అడగని సమాచారం లీక్ చేసేశారు. 

ఎమ్మెల్యే ప్రకటనతో అధికారపార్టీకి చికాకు మొదలు!

1995 నుంచి తమ అధీనంలో 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న మాట నిజమేనని ప్రకటించారు అదీప్‌రాజు. ధర ఎంతో చెబితే చెల్లిస్తామని గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. ఈ మాటలకు పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే అమర్నాథ్‌ షాక్ అయ్యారు. ఇక చేసేదేమీ లేక మొత్తం పరిణామాలను ఆయన పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. ఇక్కడి నుంచే అధికారపార్టీకి అసలు చికాకు మొదలైందని సమాచారం. కొన్ని నెలలుగా విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. పార్టీలకు అతీతంగా అందరిపైన ఒకే తరహా చర్యలు ఉంటాయనే బలమైన సంకేతాలు వెళ్తున్నాయి. గీతం యూనివర్శిటీ, ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి గంటా, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణకు చెందినదిగా చెబుతున్న భూములు సహా పలువురు నేతల లెక్కలు ఇందులో ఉన్నాయి. సుమారు 2 వేల కోట్ల విలువైన భూమిని వెనక్కు తీసుకున్నామని సర్కార్ ప్రకటిస్తున్నా.. వీటిలో ఫలానా రాజకీయ నాయకుడి బినామీ అని నిర్ధిష్టంగా చెప్పలేని పరిస్ధితి ఉంది. 

మార్కెట్‌ రేటు కట్టి రెగ్యులరైజ్‌ చేసుకోవాలని పార్టీ పెద్దల సూచన?
6 ఎకరాలు తిరిగి ఇచ్చేసే ఆలోచనలో ఎమ్మెల్యే? 

ఇప్పుడు ఎమ్మెల్యే అదీప్‌రాజు కబ్జాను స్వయంగా అంగీకరించడం వైసీపీ పెద్దల ఆగ్రహానికి కారణమైందని సమాచారం. రానున్న రోజుల్లో ఆక్రమణాలపై దూకుడుగా వెళ్లాలంటే ముందుగా వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అధికారపార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వివాదం పెద్దది కాకుండా పార్టీ ముఖ్యులు ఎమ్మెల్యే అదీప్‌రాజుకు గట్టి సూచనే చేసినట్టు తెలుస్తోంది. మార్కెట్ రేటు చెల్లించి ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్‌ చేసుకోవాలని చెప్పారట. ఆ లెక్కన ఎమ్మెల్యే తక్కువలో తక్కువ 2 కోట్లైనా ప్రభుత్వానికి కట్టక తప్పదు. దీంతో అదీప్‌రాజు డైలమాలో పడ్డారట. ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నామో అప్పటి రేటు కట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారట. అందుకు జిల్లా యంత్రాంగం అంగీకరించే పరిస్ధితి లేదని వినికిడి. ఒకరి దగ్గర బెండ్ అయితే మొత్తం వ్యవహారం మరింత దెబ్బతింటుందని భావిస్తున్న అధికారులు ఆ మేరకు స్పష్టత ఇచ్చారని సమాచారం. దీంతో టంగ్ స్లిప్‌నకు ప్రతిఫలంగా 6 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేయాలనే ఆలోచనలో అదీప్ రాజు ఉన్నారట. ఆ దిశగా కొందరు సన్నిహితుల దగ్గర చర్చిస్తున్నట్టు సమాచారం. మరి.. ఈ వివాదానికి ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి.