వైసీపీ ఎమ్మెల్యే నోరు విప్పితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాడా...?

 వైసీపీ ఎమ్మెల్యే నోరు విప్పితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాడా...?

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం దీనికి భిన్నంగా వెళ్తున్నారట. తనకు నచ్చని పనిచేసిన వారిపై నోరు పారేసుకుంటున్నారు. పబ్లిక్‌గానే బూతులు తిడుతున్నారట. ఇవి కాస్తా వీడియోలు.. ఆడియోల రూపంలో సోషల్‌ మీడియాకు ఎక్కడం.. రచ్చ రచ్చ కావడం కామనైపోయింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? 

రూటు మార్చి టాప్‌ గేర్‌లో వెళ్తోన్న ఎమ్మెల్యే !

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వీడియోలు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. రాంబాబేనా ఇలా మాట్లాడింది అని గిద్దలూరులో చర్చ జరుగుతోంది. గతంలో సైలెంట్‌గా రాజకీయం నడిపిన ఆయన ఇప్పుడు రూటు మార్చి టాప్‌ గేర్‌లో వెళ్లాలని చూస్తున్నారట. అందుకే ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే ఓ రేంజ్‌లో విరుచుకు పడుతున్నారట. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగైనా.. ప్రత్యర్థి పార్టీ కార్యకర్త అయినా ఈక్వెల్‌గా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. పబ్లిక్‌లోనే బూతులు తిట్టేస్తున్నారు. ఇలాంటి వీడియోలు.. ఆడియోలు ఇప్పుడు గిద్దలూరులో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఇలా మాట్లాడుతోంది అన్నా రాంబాబేనా అని జనం ఆశ్చర్యపోతున్నారట .

విరుచుకుపడేందుకు వెనకాడటం లేదా?

రాజకీయాల్లోకి రాకముందు రాంబాబు కాంట్రాక్టర్‌. 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి PRP ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌, టీడీపీ తిరిగి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు రాంబాబు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో రాంబాబు చాలా సైలెంట్‌ అన్న ముద్ర పడింది. అలాంటిది కోపం వస్తే ఏదో పూనకం వచ్చినట్టుగా ఊగిపోతున్నారట. పనులు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగులపై చిర్రుబుర్రులాడటం..  విపక్ష పార్టీ కార్యకర్తలపై విరుచుకుపడటానికి వెనకాడటం లేదట ఎమ్మెల్యే.

ఎమ్మెల్యేకు ఏమైంది అని గిద్దలూరులో చర్చ? 

అన్నా రాంబాబు కాన్సెప్ట్‌ ఏదైనా.. బూతులు తిట్టిన వీడియోలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.  రెండు నెలల క్రితం కంభం మండలం ఎర్రబాలెం VRO కాశీం వలీపై శివాలెత్తారు ఎమ్మెల్యే. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే బేస్తవారిపేట మండలం సింగన్నపల్లిలో తన కారుకు ఎదురెళ్లిన జనసేన కార్యకర్త చంద్రశేఖర్‌ విషయంలోనూ అదేవిధంగా నోటికి పని చెప్పారు. వార్నింగ్‌లు ఇచ్చారు. ఈ వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  అప్పటి నుంచి రాంబాబుకు ఏమైంది అన్న చర్చ మొదలైంది.  అయితే ఎమ్మెల్యే దూషణలకు మనస్తాపం చెందిన జనసేన కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో ఈ వివాదం రాజకీయంగా రాజుకుంటోంది. 

అన్నింటికీ ఒకటే మంత్రమైతే ఫలిస్తుందా? 

రాజకీయాల్లో సైలెంట్‌గా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో.. రాంబాబు దూకుడు పెంచారని పార్టీ కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ శాసనసభ్యుడు అనిపించుకునేందుకు వేచి చూడాల్సి వచ్చింది.  చివరకు  పార్టీలు మారి లక్‌ను పరీక్షించుకున్నారు. ఇప్పుడా అదృష్టాన్ని శాశ్వతం చేసుకోవాలనే ప్లాన్‌లో భాగంగా ఆయన గేర్‌ మార్చి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమైతే రివర్స్‌ కొట్టే  ఛాన్స్‌ కూడా ఉందని వైసీపీ నేతలు కొందరు హెచ్చరిస్తున్నారట. ఆ సంగతి ఎమ్మెల్యే గ్రహించారో లేదో కానీ.. అధికార పార్టీ కేడర్‌కు మాత్రం టెన్షన్‌ పట్టుకుంటోందట. మరి.. అన్నా రాంబాబు ఏం చేస్తారో చూడాలి.