పదవిలో ఉన్నా ఏ పనీ చేయలేక పోతున్న వైసీపీ ఎంపీ !

పదవిలో ఉన్నా ఏ పనీ చేయలేక పోతున్న వైసీపీ ఎంపీ !

పాపం.. ఆయన బాధ ఎవరికీ చెప్పుకోలేక మథన పడుతున్నారట. పదవి ఉంటే ఏ పనైనా చిటికెలో చేయ్యవచ్చని అంతా అనుకుంటారు. కానీ ఆయన ఏ పదవీలో ఉన్నా ఏ ఒక్క పనీ చేయలేకపోతున్నారట. 
 
2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిక!

ప్రకాశం జిల్లా  రాజకీయాలలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి సీనియర్‌ లీడర్‌. అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన మాగుంట ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. 2014 ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ కనుమరుగు కావడంతో 2014 ఎన్నికల సమయంలో సైకిల్ ఎక్కారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. టీడీపీలో ఐదేళ్ల పాటు అసంతృప్తిగానే కొనసాగిన మాగుంట 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆ ఎన్నికల్లో 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. 
 
కేడర్‌కి ఏ పనీ చేయలేకపోతున్నానని ఫీలింగ్‌!

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన 3 పార్టీలు మారారు. ఏ పార్టీలో ఉన్నా.. ప్రత్యేకంగా క్యాడర్‌ని మెయింటైన్ చేయడం అలవాటు. పార్టీలతో సంబంధం లేకుండా సొంత క్యాడర్‌ని వెంట తిప్పుకుంటారు. అయితే ఇదే మాగుంటకు ఇబ్బందిగా మారిందట. కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారట. తనను నమ్ముకున్న క్యాడర్‌కి ఏ పనీ చేయలేకపోతున్నానని ఫీలైపోతున్నారట మాగుంట. వివిధ పనులపై వచ్చే క్యాడర్‌కి సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌.
 
ఎమ్మెల్యేలకు మాగుంట ఫోన్‌ చేసినా స్పందన లేదా? 

గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. కొన్ని  అసెంబ్లీ నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులు ఎక్కువగా ఉండటం.. వారికి చాలా మంది అనుచరులు ఉండటంతో వారి మధ్య పనుల కోసం పోటీ పెరిగిపోయింది. దీంతో మాగుంట తన అనుచరులకు పనులు, పోస్టింగ్‌ల కోసం తన వద్దకు  వచ్చే అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పించుకోలేక పోతున్నారట. తనని నమ్ముకున్న వారి కోసం ఏ ఎమ్మెల్యేకైనా ఫోన్ చేస్తే.. పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదట. గత ప్రభుత్వంలో కూడా మాగుంటకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన ఐదేళ్లపాటు అసంతృప్తిగానే టీడీపీలో కొనసాగారు. ఇప్పుడు వైసీపీలో కూడా  సేమ్ సీన్ ఎదురౌతోందట.
 
ఆరేళ్లుగా మాగంట పరిస్థితి ఇదేనా? 

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో అనుకున్న పనులను క్షణాల్లో చేయించుకున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి గత ఆరేళ్లుగా క్యాడర్‌కి ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారని జిల్లా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తన అసంతృప్తిని బయటపెట్టక పోయినా.. ఎవరితో సంబంధం లేదన్నట్టు నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారట. మరి.. ఈ సీనియర్‌ పొలిటీషియన్‌ చేతిలోకి అధికార చక్రం ఎప్పుడు తిరిగి వస్తుందో చూడాలి.