జానారెడ్డి ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్లు వస్తారా?
ప్రతీ ఎన్నిక ప్రతిష్టాత్మకం అంటారు. అది వాళ్ల కాన్ఫిడెన్సో.. ఓవర్ కాన్ఫిడెన్సో అర్థం కాదు. అందరూ వద్దంటే అక్కడ దూకుడు పెంచారు. ఇప్పుడు రాబోయే ఉపఎన్నిక పేరు చెప్పి ఏకంగా కొత్త పీసీసీ చీఫ్ ఎంపికనే వాయిదా వేయించారు. మరి.. సాగర మథనం ఎలా?
సాగర్‌లో ఠాగూర్ యాక్షన్ ప్లాన్ ఏంటి?
నాగార్జునసాగర్ ఉపఎన్నిక తెలంగాణ కాంగ్రెస్‌కి పరువు ప్రతిష్టలకు సంబంధించిన పోరు. చావో రేవో తేల్చుకోవాలి. సీనియర్ నాయకుడు జానారెడ్డిని చూసి కొంత ఆత్మవిశ్వాసంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. సాగర్ ఎన్నికల్లో గెలిస్తే గ్రామాల్లో కాంగ్రెస్‌కే ఆదరణ ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పడవ మునిగితే.. అటు పార్టీ...ఇటు జానారెడ్డి రాజకీయ జీవితం రెండూ అంతా ప్రమాదంలో పడినట్టే. అంతటి కీలకమైన ఉపఎన్నికలో కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఈ అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రచారానికి అందరినీ సమన్వయం చేస్తారా?
ఠాగూర్ ఇంఛార్జ్ రాష్ట్రానికి వచ్చిన సమయంలోనే దుబ్బాక బైఎలక్షన్ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ బలం ఎంతో తెలుసుకోకుండానే ఆయన హడావిడి చేశారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. థర్డ్ ప్లేస్ వచ్చాక.. అక్కడ మాకు ఎప్పుడూ బలం లేదు అని ప్రకటనలు చేశారు నాయకులు. దుబ్బాకలో ఇంఛార్జ్ ఠాగూర్ పరువు గంగలో కలిసిందనే కామెంట్స్ గాంధీభవన్ వర్గాల్లో ఇంకా ఆగలేదు. దుబ్బాక అయిపోయింది.. మరి నాగార్జునసాగర్ పరిస్థితి ఏంటి? దీనిని ఠాగూర్ ఎలా డీల్ చేస్తారు? పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా ఉన్న నల్లగొండ లోక్‌సభ పరిధిలోనే నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఆ మేరకు ప్లానింగ్‌లో నిమగ్నమయ్యారు ఉత్తమ్, జానారెడ్డి. ఇదే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సైతం కీలకమే. జానారెడ్డి కోసం ప్రచారం చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే టాక్ ఉంది. రాజగోపాల్‌రెడ్డి పరిస్థితే డౌట్. ఈ ప్రతికూలతను కాంగ్రెస్ పార్టీ ఎలా అధిగమిస్తుందన్నది ఒక ప్రశ్నే.
ముఖ్య నాయకులు, ఠాగూర్ మధ్య గ్యాప్?
దుబ్బాకలో ప్రతి మండలానికి ఇంఛార్జిని.. ఒక్కో గ్రామంలో ఒక్కో నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. ఆ నాయకుడే ఖర్చులు కూడా భరించాలని చెప్పారు. కొత్తలో ఈ కాన్సెప్ట్ బాగానే అనిపించినా.. నాయకులకు మాత్రం దిగిన తర్వాతే లోతు తెలిసింది. అందుకే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పార్టీని ఠాగూర్ ఎలా నడిపిస్తారన్నది ఆసక్తిగా ఉంది. ఇప్పటికే ఠాగూర్‌కి రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ వచ్చింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో సన్నిహితంగా ఉండటం లేదట. అటు కోమటిరెడ్డిది కూడా సేమ్ ఫీలింగ్. పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక సందర్భంగా ఠాగూర్ అందరిని సరిగా డీల్ చేయలేదన్న కోపం నాయకుల్లో ఉంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. పార్టీ ఎమ్మెల్యేలను కోఆర్డినెట్ చేసుకునే పనిలో పడ్డారు. మండలాల వారీగా బాధ్యతలు పంచుకునే ఆలోచన చేస్తున్నారట.
సాగర్ పోరు ఠాగూర్‌కు విషమ పరీక్షేనా?
ప్రస్తుతం కాంగ్రెస్ కలహాల కాపురంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో అందరినీ ఒకతాటిపైకి తీసుకురావడం సవాలే. అంతా ఠాగూరే చూసుకుంటారు.. మనకు చెప్పిందే చేద్దామని నాయకులు భావిస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే నాగార్జునసాగర్ బైఎలక్షన్ ఠాగూర్‌కు ఓ విషమ పరీక్ష అనేవారు కూడా ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉద్దండులైన కాంగ్రెస్ నాయకులు ఏ మేరకు ఫీల్డ్‌లోకి దూకుతారో చూడాలి. అలాగే ఠాగూర్ కొత్త ప్లాన్ బయటకు తీస్తారో.. దుబ్బాక పాఠాల నుంచి కొత్తగా ఏమైనా నేర్చుకున్నారో కూడా ఇక్కడ తెలిసిపోతుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)