సాయి జపం చేస్తున్న గుంటూరు వైసీపీ నేతలు  !

సాయి జపం చేస్తున్న గుంటూరు వైసీపీ నేతలు  !

గుంటూరు జిల్లా పెదకూరపాడు వైసీపీలో అంతా సాయి జపమేనట. సాయి అనుమతి ఉంటేనే అక్కడ ఏ పని అయినా జరుగుతుందట. మరి.. ఆయనేమైనా ప్రజాప్రతినిధి అంటే అదీ కాదు. కాకపోతే పెదకూరపాడుకు షాడో ఎమ్మెల్యే అట. మరి.. అసలు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? 
 
పెదకూరపాడు వ్యవహారాలపై వేడీ వాడీ చర్చ!

గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం కృష్ణానది ఒడ్డున ఎంత సైలెంట్‌గా ఉంటుందో.. ఇక్కడ ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సైతం అంతే నెమ్మదిగా ఉంటారు. పైగా ఆయన పెదకూరపాడులో కంటే.. గుంటూరులో ఎక్కువగా ఉంటారని టాక్‌. అవసరం ఉంటే నియోజకవర్గానికి వస్తారని  ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. అయితే ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుందో..తెలియక జరుగుతుందో కానీ.. పెదకూరపాడులో చాలా  వ్యవహారాలు హాట్‌ హాట్‌ చర్చకు దారి తీస్తున్నాయి. 
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో సాయిపై రౌడీషీట్‌ తొలగింపు!

ఎమ్మెల్యే శంకరరావుకు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడిన కంతేటి సాయిబాబు పెదకూరపాడులో షాడో ఎమ్మెల్యేగా మారిపోయారట.  వాస్తవానికి  సాయిబాబుపై 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించారన్న కేసులో రౌడీషీట్‌ ఉండేది. టీడీపీలో కీలకంగా ఉండేవారని అంటారు. అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులతో దగ్గర సంబంధాలు కూడా ఉండేవట. సాయి దూకుడితో ఇబ్బంది పడ్డ ఓ నేత అతడిని టీడీపీ నుంచి  బయటకు పంపేందుకు ప్రయత్నించారట. అయితే ఆ నేత కుమారుడిపైనే సాయి చెయ్యి చేసుకోవడం కలకలం రేగిందని అంటారు. అలాంటి సాయిబాబు వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే నంబూరి శంకరరావు పంచన చేరి మళ్లీ ఇక్కడ చక్రం తిప్పడం మొదలుపెట్టారట. వైసీపీలో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే రౌడీషీట్‌ తొలగించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకొంటున్నారట పార్టీ కేడర్‌. 
 
పెదకూరపాడులో షాడో ఎమ్మెల్యేగా మారిపోయిన సాయి?

రౌడీషీట్ ఎత్తేయడంతో తనకు తిరుగు లేదని అనుకున్నారో ఏమో.. పెదకూరపాడులో షాడో ఎమ్మెల్యేగా మారిపోయారట సాయిబాబు. ఎమ్మెల్యేకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సత్తిరాజు సైతం సాయికి చేదోడు వాదోడుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోందట. అధికారులతో అనధికారికంగా సమావేశాలు నిర్వహించడం.. ఎమ్మెల్యే పేరు చెప్పి ఇసుక, ఇతర వ్యాపారాలలో సాయి కీలకంగా  ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే దగ్గర సాయి చేరిన తర్వాత వైసీపీలో మొదటి నుంచి ఉంటోన్న వారు పూర్తిగా దూరమైయ్యారని టాక్‌. పాత పరిచయాలు ఉండటంతో ప్రస్తుతం సాయి వెంట టీడీపీకి చెందినవారు తిరుగుతున్నారట. 
 
పార్టీ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన స్థానిక నాయకులు!

వైసీపీ ప్రభుత్వంలోనూ టీడీపీ వారికే ఇక్కడ పనులు జరుగుతుండటంతో పార్టీ కేడర్‌ రగిలిపోతున్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం కూడా ఈ సమస్యను మరింత జఠిలం చేస్తోందట. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట స్థానిక వైసీపీ నాయకులు. అయితే ఎమ్మెల్యే నంబూరి సౌమ్యుడు కావడంతో.. అప్పుడే ఎందుకు జోక్యం చేసుకోవడం కాస్త వేచి చూద్దామని  వారికి పార్టీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. ఏదైనా పెద్ద సమస్య వస్తే అప్పుడు మాట్లాడదాం అని సముదాయించి పంపించి వేశారట. కాకపోతే.. ఎమ్మెల్యేకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయో.. తెలియకుండా జరుగుతున్నాయో అన్నదానిపై  పార్టీ పెద్దలు ఫోకస్‌ పెట్టారట. మరి ఏం జరుగుతోంది చూడాలి.